కలం, వెబ్‌డెస్క్: వారెవ్వా టీమిండియా. ధనాధన్ ఆటతో 153 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఉఫ్ మంటూ ఊదేసింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) వీర విహారాని (68 నాటౌట్: 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) కి తోడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (57 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో కివీస్‌తో మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
గువాహటిలోని (Guwahati) బర్సాపోరా మైదానం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(48; 40 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్) టాప్ స్కోరర్. మార్క్ చాప్మన్(32), మిచెల్ శాంట్నర్(27) ఓ మోస్తరు పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, రవి బిష్ణోయ్, హార్థిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. హర్షిత్ రాణాకు 1 వికెట్ దక్కింది.
ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే సంజూ శాంసన్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 28 (13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా లెక్కచేయకుండా అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగాడు. ఈ క్రమంలో 14 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కెప్టెన్ సూర్య కుమార్ సైతం బాదుడు మొదలెట్టాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బంతికే ఫోర్ బాది జట్టుకు గెలుపు అందించాడు.
ఈ క్రమంలో భారత్ కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించడం విశేషం. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, ఇష్ సోధి చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3–0తో గెల్చుకుంది. నాలుగో టీ20 విశాఖపట్నంలో ఈ నెల 28న జరుగుతుంది.
Read Also: ఐసీసీ వార్నింగ్.. టీమ్ ను ప్రకటించిన పాకిస్తాన్
Follow Us On: Instagram


