కలం, కరీంనగర్ బ్యూరో: భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, విస్తరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేయిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, గ్రామీణ నీటి పారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రి సీతక్క శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సీతక్క ఆలయానికి రాగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు, అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా కోడె మొక్కు చెల్లించుకొని, భీమేశ్వర స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. గాయత్రి మాతను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి స్వామి వారి ప్రసాదం అందజేసి, వేదోక్త ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అత్యంత భక్తుల రద్దీ ఉండే ఆలయాల అభివృద్ధి, విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు. వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ విస్తరణ పనుల విషయమై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సీఎం, మంత్రులు హాజరై ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. రూ. 150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన వసతులు, దర్శన భాగ్యం త్వరలోనే అందుబాటులోకి రానున్నదని తెలిపారు.
అలాగే మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని తెలిపారు. ఆదివాసి పూజారులు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా గద్దెల పునర్నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులు వందల ఏండ్ల పాటు నిలిచిపోయేలా.. రెండు వందల కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేసి.. రానున్న తరాలకు చరిత్ర తెలిసేలా పనులు సీఎం రేవంత్ రెడ్డి చేయించారని వివరించారు. ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మేడారం రానున్నారని, అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 19వ తేదీన మేడారం జాతర పనులను సీఎం, మంత్రులు ప్రారంభిస్తారని వెల్లడించారు. మేడారం జాతరకు ముందు రాజన్న ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగానే తాను ఇక్కడికి వచ్చానని వివరించారు. మేడారం జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు స్వాగతం పలికామని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తల్లులను దర్శించుకోవాలని కోరారు.
రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ
రూ. 150 కోట్ల నిధులతో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు ప్రజా ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలో శ్రీకారం చుట్టారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తెలిపారు. రాజన్న భక్తులకు వేగంగా స్వామి వారి దర్శనం, మెరుగైన వసతులు కల్పించేలా పనులు సాగుతున్నాయని వివరించారు. ఈ ప్రాంతంపై ప్రత్యేక ఆసక్తి, చొరవతోనే సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. మేడారంలో కూడా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని తెలిపారు. మేడారంలో మొక్కలు చెల్లించుకునే ముందు వేములవాడ కు రావడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ప్రజా ప్రభుత్వంలో ఆలయాల నిర్మాణం, విస్తరణ పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని తెలిపారు.

Read Also: ఇదే చివరి అవకాశం.. ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీం ఆదేశం
Follow Us On: Sharechat


