epaper
Monday, March 2, 2026
epaper

డిజిటల్ హెల్త్ కార్డు.. ఫోటో, క్యూఆర్ కోడ్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నందున ఇకపైన ప్రభుత్వం దూకుడు పెంచాలనుకుంటున్నది. ఒకవైపు విద్యా రంగాన్ని పరుగులు పెట్టించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వరుస రివ్యూలు చేస్తున్నారు. మరోవైపు పురపాలక శాఖ కూడా ఆయన దగ్గరే ఉండడంతో ‘99 రోజుల ప్రణాళిక’కు శ్రీకారం చుడుతున్నారు. పరిపాలనతో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ఫోకస్ పెడుతున్న ప్రభుత్వం ప్రాధాన్యతా అంశాల ప్రకారం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. అందులో భాగంగానే రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను (Digital Health Cards) పంపిణీ చేయాలనుకుంటున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే డిజిటల్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని జూలై నుంచి ప్రజలకు అందించేలా షెడ్యూలు తయారు కానున్నది.

మూడు కోట్ల మందికిపైగానే కార్డులు :

రాష్ట్రంలో ఎంపిక చేసిన కొన్ని గ్రామాలు, వార్డుల్లో ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మరికొన్ని విభాగాల సహకారంతో పైలట్ పద్ధతిలో డిజిటల్ హెల్త్ కార్డుల (Digital Health Cards) సర్వే నిర్వహించింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఒక గ్రామం, ఒక వార్డు చొప్పున మొత్తం 238 చోట్ల అర్హులైనవారి వివరాలను సేకరించింది. ఇకపైన వివిధ శాఖల దగ్గర ఉన్న డాటా ఆధారంగా మొత్తం అర్హులైనవారిని గుర్తించి డిజిటల్ హెల్త్ కార్డుల్ని జారీ చేయాలనుకుంటున్నది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ప్రక్రియను ముగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ కార్డుల్ని జారీచేయడం ద్వారా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేందుకు మార్గం సుగమం అవుతుందని, ఇతర ఆధారాలేవీ పరిశీలించాల్సిన అవసరం లేదన్నది వైద్యారోగ్య శాఖ భావన. వివరాలన్నీ వైద్యారోగ్య శాఖ దగ్గరే ఉంటున్నందున ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అటు కార్పొరేట్ ఆస్పత్రులు, ఇటు లబ్ధిదారులకు మధ్య మీడియేటర్‌గా వ్యవహరించనున్నది.

స్మార్ట్ కార్డులపై ఫొటో, క్యూఆర్ కోడ్ :

లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు ఇవ్వడం ద్వారా పది లక్షల రూపాయల వరకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్స చేయించుకోడానికి వీలవుతుంది. ఈ కార్డులకు ఒకవైపు లబ్ధిదారుల పేరు, కలర్ ఫొటో, పుట్టిన సంవత్సరం, గ్రామం/వార్డు పేరు, మండలం, జిల్లా వివరాలుంటాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రక్రియను అమలు చేస్తున్నందున ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఎకౌంట్’కు ఉండే 14 అంకెల నెంబర్‌తో పాటు రాష్ట్రానికి చెందిన ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కేటాయించే ఐడీ నెంబర్ కూడా ఉంటాయి. క్యూఆర్ కోడ్, బార్ కోడ్ కూడా ఉంటున్నందున కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యం వీటి ఆధారంగా లబ్ధిదారుల పూర్తి వివరాలను తెలుసుకునే వీలు ఉంటుంది. మరోవైపు ఈ కార్డు ప్రత్యేకతలు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అత్యవసర సమయంలో కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్, బార్ కోడ్… ఇలాంటివి ఉంటాయి.

గ్రామాలవారీగా లబ్ధిదారులకు పంపిణీ :

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.12 కోట్ల మందికి రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా డిజిటల్ స్మార్ట్ హెల్త్ కార్డుల్ని ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నందున వాటిని గ్రామాలవారీగా లబ్ధిదారులకు అందించాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది. ఈ కార్డుల్లో తొలుత చిప్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా దాని ద్వారా తెలుసుకునే వివరాలన్నీ క్యూఆర్ కోడ్ ద్వారానే లభిస్తుండడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. ప్రజలకు సంక్షేమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలని ప్రభుత్వం భావిస్తుండడంతో ప్రస్తుతానికి డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. రానున్న రోజుల్లో మరికొన్ని వెల్ఫేర్ స్కీమ్‌లకు సైతం ఇదే తరహా విధానాన్ని అవంబించే అవకాశాలున్నాయి. యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్ ఆలోచన కూడా ఉన్నప్పటికీ వివిధ శాఖల మధ్య సమన్వయం, అమలులోని సాంకేతిక సమస్యలు.. వీటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత స్పష్టమైన నిర్ణయం వెలువడనున్నది.

Read Also: వాళ్ల‌ను ఇరాన్‌కు పంపేయండి.. నిర‌స‌న‌కారుల‌పై మోడీకి యాంక‌ర్ ర‌ష్మీ రిక్వెస్ట్

Follow Us On: Youtube

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!