కలం, వెబ్‌డెస్క్: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అజేయ అర్ధసెంచరీ (71; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో మెరవడంతో మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ముంబైకి రెండో విజయం దక్కింది. మంగళవారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జార్జియా వేర్హామ్(43 నాటౌట్; 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కనిక అహుజా(35; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెత్ మూనీ(33; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆఖర్లో భారతి ఫుల్మాలి(36 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) షాట్లు దంచేసింది. ముంబై బౌలర్లలో షబ్నిం ఇస్మాయిల్, హీలీ మ్యాథ్యూస్, నికోలా కేరీ, అమెలియా కెర్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో హర్మన్‌ప్రీత్‌కు తోడు అమన్‌జ్యోత్ కౌర్(40; 26 బంతుల్లో 7 ఫోర్లు), నికోలా కేరీ (38 నాటౌట్; 23 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో మరో నాలుగు బంతులు ఉండగానే ముంబై విజయం అందుకుంది. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్, కష్వీ గౌతమ్, సోఫీ డివైన్ తలో వికెట్ తీశారు. హర్మన్‌ప్రీత్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.కాగా, డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఎనిమిది సార్లు తలపడగా అన్ని సార్లూ ముంబైనే నెగ్గింది.

Read Also: భారత్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో రెచ్చిపోయిన పాకిస్తాన్
Follow Us On: X(Twitter)


