కలం డెస్క్ : పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఆగిపోలేదని.. దుస్సాహసానికి దిగితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది (Army Chief Upendra Dwivedi) వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ మళ్లీ రెచ్చిపోయింది. సరిహద్దు వెంట డ్రోన్లతో అటాక్ (Drone Attack) చేసేందుకు ప్రయత్నించింది. దీన్ని మన ఆర్మీ తిప్పికొట్టింది. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి సెక్టార్ ఎల్ వోసీ సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు పాక్ డ్రోన్లు కనిపించాయి. వాటిని భారత సైన్యం నేలమట్టం చేసింది. అంతకు ముందు నబ్లా ఏరియాలోనూ పాక్ డ్రోన్లను మన సైన్యం గమనించి.. వాటినీ పేల్చేసింది. కథువాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసి భద్రతా బలగాలు జల్లెడ పడ్తున్నాయి. సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదిలా ఉంటే, మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ (operation sindoor) ఇంకా కొనసాగుతూనే ఉందని, పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు దిగితే తాము సమాధానం మరింత గట్టి ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. బార్డర్ అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఓ కన్నేసి ఉంచామని చెప్పారు. ‘‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా నిరుడు మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది. ఉగ్రమూకలకు, వాటిని ప్రోత్సహిస్తున్న వారికి గుణపాఠం చెప్పాం. ఇంకా అదే తీరుగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది” అని ద్వివేది స్పష్టం చేశారు.
Read Also: రాష్ట్రానికి మరో 10 మంది ఐఏఎస్‌లు
Follow Us On : WhatsApp


