కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలంలోని (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రంలో కృష్ణాష్టమి వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఆలయంలో ‘రామయ్య సమక్షంలో కృష్ణయ్య ఉట్ల వేడుకలు’ భక్తుల జయజయధ్వానాల మధ్య వైభవంగా సాగాయి. కృష్ణాష్టమి సందర్భంగా రాత్రి ఆలయంలో స్వామివారికి సమర్పణ తిరుమంజనం, అవతార కారిక, విశేష అభిషేకాలు, నైవేద్య సమర్పణలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతార విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. అనంతరం శనివారం ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత స్వామివారికి దర్బార్ సేవ నిర్వహించారు. సాధారణంగా దేవస్థానంలో జరిగే వివిధ సేవల్లో సీతారామలక్ష్మణులు మాత్రమే పాల్గొంటారు. అయితే కృష్ణాష్టమి ఉట్ల ఉత్సవం ప్రత్యేకతగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా రాములవారితో కలిసి ముఖమండపానికి వేంచేసి భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు.
యాదవుల ఆధ్వర్యంలో ఉట్ల వేడుక
ఆలయ ముఖమండపం వద్ద స్థానిక యాదవుల ఆధ్వర్యంలో ఉట్ల వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది భద్రాచలంలోని యాదవులు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలో పాల్గొని ఉట్లు కొట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. భక్తుల జయజయధ్వానాల మధ్య ఉట్ల వేడుక ఉత్సాహంగా సాగింది.
ఆలయ ప్రాంగణానికే పరిమితమైన ఉత్సవం
ప్రస్తుతం భద్రాచలం (Bhadrachalam) దేవస్థానంలో జీర్ణోద్ధరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్వామివారిని తిరువీధి సేవకు బయటకు తీసుకువెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో ఈసారి ఉట్ల ఉత్సవాన్ని ఆలయ ప్రాంగణానికే పరిమితం చేశారు. ఉట్లు కొట్టిన అనంతరం స్వామివారిని తిరిగి అంతరాలయానికి తీసుకెళ్లారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈఓ) పర్యవేక్షణలో అర్చక బృందం కృష్ణాష్టమి వేడుకలను విజయవంతంగా నిర్వహించింది. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Also Read : బీజేపీ చెత్త కుప్ప కాదు: మురళీధర్ రావు
Follow Us On: Instagram

