కలం, ఇంద్రవెల్లి: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Adilabad Collector ) అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ తండా గ్రామంలో టీబీ రహిత గిరిజన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించి సందర్శించారు. ఈ సందర్భంగా సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిర ప్రచార వాహనాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం రోగులకు నిక్షయ్ మిత్ర కిట్లను పంపిణీ చేయడంతో పాటు, మెడికల్ ఆఫీసర్ సరస్వతిని అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పిరమల్ ఫౌండేషన్ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా (ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో) మూడు బ్లాకుల్లో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో కలెక్టర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేస్తూ స్థానికులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.సాధన, అదనపు డీఎంహెచ్‌వో మనోహర్, డీఆర్డీవో రవీందర్, ప్రోగ్రామ్ అధికారి సుమలత, సర్పంచ్ రోహిదాస్, పిరమల్, స్టాప్ టీబీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్లు, గ్రామస్థులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

