కలం, వెబ్ డెస్క్: కొండా సురేఖ (Konda Surekha) బీజేపీలోకి చేరబోతున్నారనే ఊహాగానాలు వస్తున్న వేళ బీజేపీ కీలక నేత మురళీధర్ రావు (Muralidhar Rao) ఘాటుగా స్పందించారు. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవారు, ఎప్పుడు పడితే అప్పుడు రావాలనుకునేవారిని చేర్చుకోవడానికి బీజేపీ చెత్త కుప్ప కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ సంక్షోభంలో పడిన ప్రతీసారి బీజేపీని మీడియా ఎందుకు లాగుతుంటుందని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి నిబద్ధత కలిగిన కార్యకర్తలున్నారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తామే ప్రత్యామ్నాయం అని తేల్చి చెప్పారు. రాజకీయ అవకాశవాదులకు బీజేపీ నిలయంగా మారబోదన్నారు. ఇలాంటి కల్పిత ప్రచారాలు చేసే ముందు దయచేసి జాగ్రత్తలు వహించాలని మీడియాను కోరారు.
అందుకే ఆగ్రహమా..?
కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన తరువాత ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిద్దరు బీజేపీ నేతలు కొండా సురేఖ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మురళీధర్ రావు (Muralidhar Rao) ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కొండా సురేఖ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేసిన విషయం విదితమే.
Also Read : బీఆర్ఎస్ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Follow Us on : WhatsApp

