తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Telangana Assembly) సెప్టెంబరు 7 నుంచి జరగనున్నాయి. నాలుగైదు రోజుల పాటు జరిగే అవకాశమున్నది. ఈ నెల చివర్లోనే నిర్వహించాలని భావించినా కొన్ని నిర్దిష్ట కారణాల రీత్యా వచ్చే నెల ఫస్ట్ వీక్‌కు వాయిదా పడింది. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కొద్దిసేపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. పర్యటన గురించి వివరిస్తూనే ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని, ఇందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా వాడుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, ఫీజు రీఇంబర్స్ మెంట్, హిల్ట్ పాలసీ, రైతుభరోసా తదితరాలపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఎలా అమలైందో.. ఇప్పుడు ఎలా అమలవుతున్నదో లెక్కలతో సహా సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే అంశాన్ని సంగారెడ్డిలో ఈ నెల 15న జరిగిన బహిరంగసభ ద్వారా మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీ సెషన్‌కు రావాలని సవాలు విసిరారు.

జెన్-జీ యూత్ ఎన్నికల పోటీపై సస్పెన్స్ :

పలు అంశాల్లో జెన్-జీ యువత అవగాహనపై ఇటీవల కామెంట్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి… శాసనసభ, లోక్‌సభకు పోటీచేసే వయసును 25 ఏండ్ల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని వ్యాఖ్యానించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపిస్తామన్నారు. దీంతో రాబోయే అసెంబ్లీ సెషన్‌లో ఈ అంశంపై చర్చ జరుగుతుందా?.. తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలన్న ఆలోచన ఉందా?.. ఈ అంశాలపై స్పష్టత రావాల్సి ఉన్నది. కానీ విపక్షాలు తరచూ ప్రభుత్వంపైనా, సంక్షేమ పథకాల అమలుపైనా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానిపై అసెంబ్లీ వేదికగానే ప్రజలకు పూర్తి వివరాలను, లెక్కలను చెప్పి గత ప్రభుత్వంలోని నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలన్నది సీఎం ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఫీజు రీఇంబర్స్ మెంట్ విషయంలోనూ బీజేపీ, బీఆర్ఎస్ ప్రతీ రోజు విమర్శలు చేస్తున్నందున ఇప్పటివరకు విడుదల చేసిన మొత్తం, ప్రభుత్వం ఏర్పడేనాటికి ఉన్న పెండింగ్ బిల్లులను వివరించాలనుకుంటున్నది.

నిషేధిత భూములపైనా క్లారిటీ ఇవ్వాలనే ప్లాన్ :

రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న 22-ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నందున దీనిపై అసెంబ్లీ (Telangana Assembly)లో ప్రత్యేకంగా చర్చ నిర్వహించి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నది. అధికారుల తప్పిదంతో కొన్ని భూములు జాబితాలో చేరినందుకు స్వయంగా మంత్రి ‘సారీ’ చెప్పినా దాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నందున గత ప్రభుత్వంలో ధరణి ద్వారా చేరిన భూముల విస్తీర్ణమెంత.. ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి.. ఇప్పుడు అదనంగా ఎన్ని చేరాయి.. ఇలాంటి అంశాలన్నింటిపైనా శాసనసభ వేదిక ద్వారానే వెల్లడించే అవకాశమున్నది. ప్రత్యేకంగా ఈ అంశంపైనే చర్చ పెట్టి ఎక్కడ లోపం జరిగిందో, ఎందుకు జరిగిందో, అధికారుల తప్పిదాలేంటో, గత ప్రభుత్వంలో నిర్వాకమేంటో వివరించడంపై ఆ శాఖ దృష్టి సారించింది.

Also Read : కాంగ్రెస్ విద్యావిధానాలపై కొప్పుల ఫైర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>