కలం, ఖమ్మం బ్యూరో: పేద ప్రజలకు అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వ్యక్తిపై ఖమ్మం పోలీసులు (Khammam Police) పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వివరాల ప్రకారం.. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మీర్జా జిలానీ బేగ్ (48)పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. జిలానీ బేగ్ స్థానిక రేషన్ డీలర్లు, వారి ఏజెంట్ల ద్వారా కార్డుదారులకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా సేకరించి, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నాడు. నిందితుడిపై తల్లాడ పోలీస్ స్టేషన్‌లో 4 కేసులు నమోదయ్యాయి. BNSS సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసినా మార్పు రాకపోవడంతో పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. సీపీ ఆదేశాలతో వైరా సీఐ వెంకట ప్రసాద్, తల్లాడ ఎస్సై వెంకట కృష్ణ నిందితుడిని అదుపులోకి తీసుకుని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

