కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar)నగరంలోని రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి, చింతకుంట, మల్కాపూర్ రోడ్ తదితర ప్రాంతాలలోని పట్టా భూములు, నివాస గృహాలను అక్రమంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రేకుర్తి, పరిసర ప్రాంతాలలో ప్రజలు తమ కష్టార్జితంతో స్థలాలు కొనుగోలు చేసి, ప్రభుత్వానికి క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులు చెల్లిస్తూ చట్టబద్ధంగా ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయా భూములు, ఇళ్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ఆస్తులను విక్రయించుకోలేకపోవడంతో పాటు గృహ రుణాలు పొందే అవకాశం లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ప్రతి సర్వే నంబర్‌ను అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. బాధితుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, నివాస గృహాలు ఉన్న ప్రాంతాలను తక్షణమే 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు. బాధితులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వారి ఆస్తులు, హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. రేకుర్తి 22ఏ బాధితులు చేస్తున్న ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటానికి ప్రభుత్వం అండగా నిలిచి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి, నాయకులు శ్రీరాముల రమేష్, రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, నూతి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

