కలం, నాగర్ కర్నూల్: ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి సురక్షితంగా చేరుకునేలా రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి పరుస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా అచ్చంపేట (Achampet) లో కోట్లతో నిర్మించనున్న రోడ్ల పనులకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి అచ్చంపేట నియోజకవర్గంలో రూ. 146 కోట్లతో చేపట్టనున్న రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ మూడేళ్ల కాలంలో దాదాపుగా రూ. 40 వేల కోట్లతో రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. హ్యామ్ విధానంలో ఆర్బీఐ సహకారంతో నేషనల్ హైవే రోడ్ల మాదిరిగా ఈ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. రోడ్లు వేసిన కాంట్రాక్టర్ 15 సంవత్సరాల పాటు పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో గ్రామం నుంచి మండలానికి సింగిల్ రోడ్లు, మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రోడ్ల పనుల్లో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతగా చేపట్టేలా కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. రోడ్లు బాగా లేకుంటే చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గం నుంచి శ్రీశైలంకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరగబోతుందని తెలిపారు.
దీనివల్ల హైదరాబాద్ నుంచి శ్రీశైలానికికు వెళ్లేందుకు ఎంతో సౌలభ్యం కలుగుతుందన్నారు. అలాగే శంషాబాద్ నుంచి బెంగళూరుకు రెండున్నర గంటల్లోనే ప్రయాణించేలా బుల్లెట్ ట్రైన్ మంజూరు అయ్యిందని తెలిపారు. హైదరాబాదు నుంచి చెన్నై, ముంబై, పూణే, బెంగళూరు లాంటి ప్రాంతాలకు బుల్లెట్ రైలు మార్గం అందుబాటులోకి వచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా కృష్ణా నదిపై కొల్లాపూర్ నుంచి 900 కోట్లతో ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
ఇంత పెద్ద అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం అవుతుందని అన్నారు. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిస్తే ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసినా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాకు దాదాపుగా రూ. 3 వేల కోట్లు మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, అప్పుల ఊబిలో ఉన్నా గత ప్రభుత్వంలో అమలైన పథకాలతో పాటుగా ఎన్నో పథకాలను కొత్తగా ప్రారంభించి అమలు చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.
నల్లమాలను ప్రత్యేక జోన్‌గా భావించి పర్యాటక రంగంలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ప్రాంతమైన అచ్చంపేటలో సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు కార్యచరణ రూపొందించారన్నారు. సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను, రుగ్మతలను దూరం చేయాలన్నారు. దీనికోసం త్వరలో అచ్చంపేటలో ప్రత్యేకంగా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

