కలం, హనుమకొండ: పగటిపూట రెక్కీ. రాత్రివేళ చోరీ. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మిల్స్‌కాలనీ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన 70.19 గ్రాముల బంగారు ఆభరణాలు, 527.9 గ్రాముల వెండి, రూ.29,875 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ (Hanumakonda) కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కవిత వివరాలు వెల్లడించారు.
పెద్దపల్లికి చెందిన ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల (27) ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నివసిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో దొంగ తనాలను మార్గంగా ఎంచుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీకి పాల్పడటం మొదలు పెట్టాడు. పగటిపూట ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి.. రాత్రివేళ ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడేవాడు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల వరుస దొంగతనాలు జరగడంతో కమిషనర్ శ్వేత ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ఆశిష్ శివనగర్, ఎస్‌ఆర్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది. మహారాష్ట్రలో 2024, 2025 సంవత్సరాల్లో నాలుగు చోరీలకు పాల్పడిన నిందితుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా తన పంథా మార్చుకోకుండా మళ్లీ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడి అరెస్టులో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ స్వామి, ఎస్‌ఐ మహేష్, ఏఏఓ సల్మాన్ పాషా, సీసీఎస్, మిల్స్‌కాలనీ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

