డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవినీతి : టిఎఫ్‌టియు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణంలోని నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య (టిఎఫ్‌టియు) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిఎఫ్‌టియు ప్రధాన కార్యదర్శి పి. యాదగిరి మాట్లాడుతూ 2018లో క్రిస్టియన్‌పల్లి సర్వే నెం. 523 లో పేదలకు ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లను డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం తిరిగి తీసుకుందన్నారు.

మొత్తం 888 మంది పట్టాలు స్వాధీనం చేయగా, 710 మందిని అర్హులుగా ప్రకటించారని, అందులో కేవలం 100 మందికి మాత్రమే ఇళ్లు ఇచ్చి, మిగిలిన 610 మంది అర్హులైన పేదలను 8 ఏళ్లుగా మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సొంత పట్టా భూమిని కోల్పోయి వారు రోడ్డున పడ్డారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహబూబ్‌నగర్ అర్బన్ తహశీల్దార్ నివేదిక ప్రకారం ఇంకా 1028.21 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందనీ,ఈ భూమిలో ఇళ్లు రాని పేదలందరికీ ఇందిరమ్మ పథకం కింద 100 చ.గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అవినీతి జరిగిందని, అర్హత లేని 130 మందికి పైగా ధనికులకు, సిఫారసులతో ఇళ్లు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. దివిటిపల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీలో ఇప్పటికీ అక్రమ క్రయవిక్రయాలు జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై ఆర్.టి.ఐ ద్వారా సమాచారం అడిగితే అధికారులు సమాచారం దాస్తున్నారన్నారు.
15 రోజుల్లోగా స్పందించకపోతే తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేస్తామని, లోకాయుక్తను ఆశ్రయిస్తామని ఈ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టిఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు పి. విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పి. యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు జి. గట్టన్న, పట్టణ కార్యదర్శి ఎండి. జలాల్ పాషా, టి. అనురాధ, ధనుంజయ చారి, ఎండి. బషీరుద్దీన్, లలిత తోపాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>