కలం, వెబ్ డెస్క్: గత వారం రోజులుగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్న మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అనూహ్యంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘ప్రత్యేక వనమహోత్సవం’ ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఓ ట్వీట్ కూడా చేశారు.లండన్ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో కొండా సురేఖను పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారంటూ ప్రచారం సాగుతున్న వేళ కొండా సురేఖ వారం రోజుల తర్వాత అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొనడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది.
జూమ్ ద్వారా అధికారులతో సమావేశం
మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తన నివాసం నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. అరణ్య భవన్ నుంచి అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, పీసీసీఎఫ్ వినయ్ కుమార్ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎఫ్‌ఓలతో మంత్రి సురేఖ ప్రత్యేక వనమహోత్సవం నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా కార్యక్రమాల ఏర్పాట్లు, ఇప్పటివరకు జరిగిన పురోగతిని ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వనమహోత్సవాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు కార్యక్రమంలో ప్రజలు, స్థానిక సంస్థలు, వివిధ వర్గాల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే కొండా సురేఖ బర్తరఫ్ పై చర్చ జరుగుతున్న వేళ ఆమె అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : ఇదేం ప్రజావాణి..? రీల్స్‌తో టైంపాస్ చేస్తున్న అధికారులు!
Follow Us On : WhatsApp

