కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ నిబంధనలను అనుసరించి లే అవుట్ల (Layout) కు అనుమతులు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) స్పష్టం చేశారు. సోమవారం నారాయణపేట (Narayanpet) జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నిర్వహించిన జిల్లా లే అవుట్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. లే అవుట్ల అనుమతుల జారీ విషయంలో అధికారులు అన్ని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తి స్థాయి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కమిటీ పరిశీలనకు వచ్చిన జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన 6 లే అవుట్ దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారుల క్లియరెన్స్ వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. కమిటీ పరిశీలన అనంతరం 3 లే అవుట్లకు అనుమతులు మంజూరు చేయగా, మరో 3 లే అవుట్ల దరఖాస్తులను తిరస్కరించింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లే అవుట్ అనుమతుల జారీ ప్రక్రియలో ఆన్లైన్ విధానం తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ప్రక్రియను సులభతరం చేయడం, సమయాన్ని తగ్గించడం, అనవసరమైన భౌతిక సమావేశాలను నివారించడమేనని కలెక్టర్ తెలిపారు. ఆన్లైన్లో పరిశీలన పూర్తయిన తర్వాత కూడా ప్రతి దరఖాస్తుకు మళ్లీ భౌతిక సమావేశం నిర్వహిస్తే ప్రక్రియ రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఆన్లైన్ వెరిఫికేషన్ సమయంలో ఏదైనా అధికారి లేదా కమిటీ సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఆ అభ్యంతరాన్ని సిస్టమ్‌లోనే నమోదు చేసే విధానం ఉండాలని సూచించారు.
అభ్యంతరం నమోదైన సందర్భంలో సంబంధిత ఫైల్‌ను తదుపరి స్థాయికి ఆటోమేటిక్‌గా పంపించేలా ప్రక్రియను రూపొందించవచ్చని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఆమోదించిన దరఖాస్తులకు మళ్లీ ప్రత్యేకంగా భౌతిక సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్లోనే తదుపరి ప్రక్రియకు ఫైల్‌ను పంపించే విధానం అమలు చేస్తే సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని స్పష్టం చేశారు. ఏదైనా అంశంపై అభ్యంతరం ఉన్న దరఖాస్తులను మాత్రమే భౌతిక సమావేశానికి తీసుకువచ్చి చర్చించి నిర్ణయం తీసుకునే విధానం మరింత సమర్థవంతంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇకపై ప్రతి లే అవుట్‌లోనూ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు, లే అవుట్లలో పచ్చదనం పెంపొందించేందుకు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, పంచాయతీరాజ్ ఈఈ అశోక్, నీటిపారుదల శాఖ ఈఈ సాల్మన్, ఆర్అండ్బీ ఈఈ వెంకట రమణయ్య, డీటీసీపీఓ కిరణ్, కోస్గి, మక్తల్, మద్దూరు టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

