కలం, వెబ్ డెస్క్ : NEET – Union Cabinet | నీట్ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లుకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం, ఇతర పోటీ పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది. పేపర్ లీక్ లకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది.
మరోవైపు ప్రధాని సూచనల మేరకు బిల్లులో చేర్చాల్సిన కీలక నిబంధనలపై అధికారులు విస్తృతంగా కసరత్తు జరిపినట్లు సమాచారం. పేపర్ లీక్ లకు పాల్పడిన వారిపై ప్రస్తుతం ఉన్న శిక్షలను మరింత కఠినతరం చేస్తూ భారీ జరిమానాలు, కఠిన జైలు శిక్షలు, అలాగే కేసులలో వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే అంశాలను బిల్లులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కొత్త సవరణల ప్రకారం పేపర్ లీక్ లేదా పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే ఏకంగా పదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలు పొందుపరిచారు.
జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలు, CJP ప్రతినిధులతో రెండుసార్లు జరిగిన చర్చల్లో వచ్చిన సూచనలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సవరణ బిల్లును సోమవారం పార్లమెంటు ఉభయసభల్లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుతో పరీక్షల్లో పారదర్శకతను పెంచడంతోపాటు పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
ఆ బిల్లులోని కొన్ని కీలక అంశాలు :
- పేపర్ లీక్ మాఫియాపై నిబంధనలు కఠినతరం
- ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు చట్టబద్ధత
- దర్యాప్తును పూర్తి చేసి, మూడు నెలల వ్యవధిలోనే తీర్పు వెలువరించాలి
- పేపర్ లీక్ కేసులలో గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష
- గరిష్టంగా రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధన
Read Also: కేటీఆర్‌పై బ్యానర్‌పై విచిత్ర వాదన, పింకీస్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్
Follow Us On : WhatsApp

