కలం, కరీంనగర్ బ్యూరో: “ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే ప్రధాని” అనే సమున్నత లక్ష్యంతో కాశ్మీర్ సమగ్రత కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, ప్రాతఃస్మరణీయులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి నేడు. ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Sunil Rao) ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నగరంలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Sunil Rao) డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సునీల్ రావు మాట్లాడుతూ.. అవిభాజ్య భారత్ కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ పరితపించారని… దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉంచడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ పూర్తిస్థాయి విలీనం కోసం ఆయన చేసిన పోరాటం, బలిదానం చిరస్మరణీయం అని కొనియాడారు. 2019లో ఆర్టికల్ 370, 35(ఎ)ల రద్దు ద్వారా ఆయన త్యాగానికి సరైన నివాళి అర్పించడం జరిగిందని తెలిపారు.
స్వతంత్ర భారత తొలి పారిశ్రామిక శాఖ మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి దేశ పారిశ్రామిక ప్రగతికి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. అలాగే, అతి పిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీ ఉప కులపతిగా బాధ్యతలు చేపట్టి, విద్యావ్యవస్థలో భారతీయ విలువలకు పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. .
రాజకీయ సిద్ధాంతాలను పక్కనబెట్టి కేవలం దేశ పురోగమనం కోసమే నెహ్రూ మంత్రిమండలిలో చేరినప్పటికీ, జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాల్లో తన భావాలకు భిన్నంగా జరుగుతోందని భావించినప్పుడు ఏమాత్రం వెనుకాడకుండా మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నిబద్ధత ఆయనదని కొనియాడారు.1943 బెంగాల్ క్షామం, 1942 మిడ్నాపూర్ తుఫాను విపత్తుల సమయంలో ప్రజల ఆకలి తీర్చడానికి, ఆశ్రయం కల్పించడానికి ఆయన స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. “చేసే పనిని శ్రద్ధగా, అర్థవంతంగా చేయండి. ఏ పనీ అర్ధాంతరంగా వదిలేయకండి” అని ఆయన యువతకు ఇచ్చిన పిలుపు నేటికీ ఆచరణీయం అన్నారు. నేడు మనం నిర్మించుకుంటున్న ‘వికసిత్ భారత్’ డా. ముఖర్జీ ఆశయాలకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యాదగిరి సునీల్ రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పండుగ నాగరాజు, ఉపేందర్, ఆంజనేయులు, రవి, మహేందర్, రోహిత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!
Follow Us On: Instagram

