Mobile Popup Ad
Mobile Popup Ad

ఓటర్లకు కలెక్టర్ కీలక సూచన.. ఈ నెల 24లోపు ఫారం సమర్పించండి

కలం, నిజామాబాద్ బ్యూరో: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంను పూరించి, నిర్ణీత గడువు లోపు ప్రతి ఓటరు తప్పనిసరిగా బూత్ లెవెల్ అధికారికి అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) సూచించారు. సోమవారం నిజామాబాద్‌లో ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు అందరూ విధిగా ఈ నెల 24వ తేదీ లోపు ఎన్యూమరేషన్ ఫారంను నింపి బీఎల్ఓలకు అందించాలన్నారు.

లేని పక్షంలో ఆగస్టు 5వ తేదీన ప్రచురించే ఓటర్ల ముసాయిదా జాబితాలో పేరు కోల్పోతారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదని, అధికారులు ఎంత పెద్ద హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు ఎన్యూమరేషన్ ఫారం అందించాల్సిందేనని అన్నారు. జిల్లాలో దాదాపుగా అన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు.

అయితే తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారంలను తగిన వివరాలతో పూరించి, బీఎల్ఓలకు గడువులోపు అందించడం ఎంతో ముఖ్యమని సూచించారు. ఈ మేరకు ఓటర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, వివిధ శాఖల జిల్లా అధికారులకు, మండల స్పెషల్ ఆఫీసర్లు అవకాశం మేరకు తహశీల్దార్ కార్యాలయాలను సందర్శించి, SIR అమలు తీరును, బీఎల్ఓల పనితీరును పరిశీలించాలని అన్నారు.

కాగా, ఎన్యూమరేషన్ ఫారం భర్తీ విషయంలో, SIR ప్రక్రియకు సంబంధించి ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ, తగిన సహకారం అందించేందుకు వీలుగా కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్‌ను ఆదేశించారు. ఇదిలాఉండగా, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.

విద్యా సంస్థలను మొక్కుబడిగా సందర్శించకుండా, వాటి పనితీరును నిశితంగా పరిశీలించాలని, ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది గమనించాలని అన్నారు. అధికారుల సందర్శనతో విద్యా సంస్థల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. ఓపెన్ బావులు వంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. విద్యార్థులు పాముకాటు, విష కీటకాల బారిన పడకుండా అన్నివిద్యా సంస్థల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అంకిత భావంతో ఉత్తమ స్థాయిలో విధులు నిర్వర్తించే మండల స్పెషల్ ఆఫీసర్‌ను ఎంపిక చేసి తగిన ప్రోత్సాహకం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, జెడ్పీసీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, డీపీఓ శ్రీనివాస్ రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 131 ఫిర్యాదులు..

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్, భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ సాయన్న‌, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>