కలం, వెబ్ డెస్క్: పహల్గాం(Pahalgam)లో ఉగ్ర దాడికి లష్కర్-ఎ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుట్ర పన్ని, అమలు చేశాడని ఎన్ఐఏ తేల్చింది. ఈ మేరకు జమ్మూ కశ్మీరులోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన అనుబంధ ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది.
అతడి ప్రోద్బలంతోనే ఏర్పాటైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కరులు పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారని పేర్కొంది. ఈ మేరకు హఫీజ్ సయీద్‌పై బీఎన్ఎస్‌లో పలు సెక్షన్లతో పాటు ఉపా చట్టం కింద కూడా కేసులు నమోదు చేసింది.
1,597 పేజీలతో ఛార్జిషీట్..
పహల్గాం ఉగ్ర దాడికి ఎలా కుట్ర చేశారు.. దీని వెనుక ఎవరున్నారనే పూర్తి వివరాలతో కూడిన 1,597 పేజీల ఛార్జిషీట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టుకు అందజేసింది. దీనిలో హఫీజ్ సయీద్ ఎలా కుట్రను ముందుండి నడిపించాడో.. దాడికి పాల్పడినవారికి ఎలాంటి సహాయం అందించాడో పూర్తిగా వివరించింది. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో పాటు సైంటిఫిక్ పద్ధతుల్లో దర్యాప్తు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.
ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం..
2025 ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయ చూసేందుకు వచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు మతం పేరు అడుగుతూ మరీ చంపేశారు. ప్రపంచమే ఉలిక్కి పడిన ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పీవోకే ప్రాంతంలో తిష్ట వేసిన వందల మంది ఉగ్రవాదులను చంపేసింది. అనంతరం, భారత సైన్యం మరో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పహల్గాం ఉగ్ర దాడిలో పాల్గొన్న సులేమాన్ షా, హమ్జా అఫ్గనీ, జిబ్రాన్ భాయ్‌ను హతమార్చింది.

