కలం, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల (Pulichinthala) విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు కల్పించాలంటూ కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఈ ఆందోళన క్రమంలో కొందరు కార్మికులు పెట్రోల్ పోసుకుని ఆత్మహుతికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. పులిచింతల ప్రాజెక్టులో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు అనుభవాన్ని బట్టి ఆర్టిజన్ ఉద్యోగాలు ఇస్తామని, గతంలో ఉన్నతాధికారులు, యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు ఆ హామీని పక్కనబెట్టి మాట మార్చారని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమకు న్యాయం చేయాలంటూ రెగ్యులర్ ఉద్యోగులను, ఉన్నతాధికారులను ఎవరినీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లోపలికి వెళ్లకుండా గేట్ల వద్దే ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. న్యాయం జరిగేంత వరకు విధుల్లోకి చేరేది లేదని గేటు ముందు బైఠాయించారు. నిరసన (Protest) తెలుపుతున్న క్రమంలో, అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన ఉధృతంగా మారింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కొంతమంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అప్రమత్తమైన తోటి కార్మికులు, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహుతికి యత్నించిన వారిని పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు భారీ బందోబస్తు
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సమస్య తీవ్రత దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు విద్యుత్ కేంద్రం యాజమాన్యంతో, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాత్కాలికంగా ఆందోళన విరమింపజేసేందుకు చర్చలు నడుపుతున్నప్పటికీ, యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక హామీ లభించలేదు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనను కొనసాగిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

