కలం, తెలంగాణ బ్యూరో: పశ్చిమ బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణలోనూ బీజేపీ పాగా వేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా వ్యక్తంచేశారు. ‘‘బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన స్ఫూర్తితో తెలంగాణలోనూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలి” అని పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. ప్రజాసేవ, నిరంతర ఉద్యమాల ద్వారానే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఆదివారం బీజేపీ ఆఫీస్‌ను నితిన్ నబిన్ ప్రారంభించారు. ఇదే వేదికగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లోని పార్టీ జిల్లా కార్యాలయాలను వర్చువల్‌గా ఓపెన్ చేశారు. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన బూత్ అధ్యక్షుల సమ్మేళనంలోనూ ప్రసంగించారు. బెంగాల్‌లో పార్టీ కార్యకర్తల నిరంతర శ్రమ ఫలితంగానే బీజేపీ విజయం సాధించిందని తెలిపారు. అదే స్ఫూర్తి తెలంగాణలోని ప్రతీ కార్యకర్తలో ఉండాలన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితేనే అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు.
రాష్ట్ర ఏర్పాటులో బీజేపీది కీలక పాత్ర..
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ‘ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్’ లక్ష్యంతో పనిచేస్తున్నదని నితిన్ నబిన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి మరువలేనిదని ఆయన గుర్తుచేశారు. వికసిత్ తెలంగాణ కోసం తమతో రాష్ట్ర ప్రజలు కలిసి రావాలని కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందని.. ఆ నేతలు ఇచ్చిన హామీలన్నీ ఉత్తవేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీది ఇటలీ భావజాలమని, కార్యాచరణ అంటూ ఉండదని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడిందని, ఆ పార్టీది అవినీతి చరిత్ర అని ఆరోపించారు.
కార్పొరేషన్లలో గెలుపు మాదే: రాంచందర్ రావు
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి వచ్చినా బీజేపీని అడ్డుకోలేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ వైపు చూస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లలో కమలం వికసించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధిని విస్మరించి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. నగర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రతీ బూత్ అధ్యక్షుడు, కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు.
హామీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్: కిషన్‌రెడ్డి
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయాలని బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ విజయం కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు. తెలంగాణలోనూ బీజేపీకి ప్రజల ఆదరణ పెరుగుతోందని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు.

