ఎల్‌ నినో తీవ్ర ప్రభావం.. ధాన్యం దిగుబడి డౌన్!

కలం, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ రంగంపై ఎల్‌ నినో (El Nino) తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈసారి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గుతుందని, ఎల్‌ నినో వల్ల ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ యూనివర్సిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం దాదాపు 14 శాతం తగ్గిందని, దీనికి తోడు ఎల్‌ నినో వల్ల దిగుబడి తగ్గిపోతుందని.. దీంతో ఈసారి అనుకున్న స్థాయిలో వడ్లు మార్కెట్‌లోకి రావని పేర్కొంటున్నారు.

గతేడాది ఖరీఫ్‌లో కోటిన్నర టన్నుల మేర ధాన్యం దిగుబడి వస్తే, ఈసారి అది కోటి 10 లక్షల టన్నులకు పరిమితం కావచ్చని అంచనా. ఇందులో ప్రభుత్వం 80 లక్షల టన్నుల్లోపే సేకరించే అవకాశమున్నది. ఖరీఫ్ సీజన్‌లోనే ఈ పరిస్థితి నెలకొంటే రాబోయే రబీ సీజన్ మరింత దయనీయంగా ఉంటుందని, ఆ ప్రభావం ఓపెన్ మార్కెట్‌లో బియ్యం ధరలు (Rice Prices) విపరీతంగా పెరగడానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైన్ వెరైటీ రైస్ క్వింటాల్ ధర రూ.8 వేలకు పైనే ఉన్నదని, ఎల్‌ నినో ఎఫెక్ట్‌తో అది రూ.10 వేలు దాటినా ఆశ్చర్యం లేదని హోల్‌సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

పెరిగిన ఇతర పంటల సాగు

ఎల్‌ నినో (El Nino) కారణంగా సాగునీటికి ఇబ్బందులు ఉంటాయని, కాల్వల ద్వారా నీరు అందకపోవచ్చని, వర్షాలు కూడా తక్కువే కురుస్తాయని హెచ్చరించిన ప్రభుత్వం.. ఆరుతడి పంటలకే మొగ్గు చూపాలని రైతులకు సూచించింది. దీంతో గతేడాదికంటే వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు తృణధాన్యాలు, పప్పుధాన్యాల సాగు పెరిగింది. జొన్నలు, సజ్జలు, రాగి, కందులు, పెసర్లు, మినుములు సహా పత్తి పంట సాగు సాధారణ కంటే గణనీయంగా పెరిగింది. ఈసారి కొర్రలు, సామలు లాంటి మైనర్ మిల్లెట్స్ సాగు కూడా మూడు రెట్లు పెరిగింది.

వరి సాగు (Paddy Cultivation) మాత్రం సాధారణం కంటే 14% తగ్గింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 11 లక్షల ఎకరాలు తగ్గింది. గతేడాది అన్ని రకాల పంటలు కలిపి 1.33 కోట్ల ఎకరాల్లో సాగైతే, ఈసారి అది 1.26 కోట్ల ఎకరాలకు (5%) తగ్గింది. నైరుతి రుతుపవనాల (జూన్-సెప్టెంబర్) ద్వారా ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో సగటున 70.9 సెంటీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, అది 20% మేర తగ్గి 56.7 సెంటీమీటర్లకు పరిమితమైంది.

బియ్యం ధరలు పెరిగే అవకాశం

రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం ఖరీఫ్ సాగుపై అధ్యయనం చేసింది. రాష్ట్రంలో ఎల్‌ నినో ప్రభావం, వర్షపాతం నమోదు, రిజర్వాయర్లలో నీటి మట్టం, సాగునీటి సౌకర్యం, భూగర్భ జలమట్టంలో వచ్చిన మార్పులు, వరి సాగు విస్తీర్ణం, ఆరుతడి పంటల సాగు, ఉష్ణోగతల కారణంగా వరి దిగుబడిపై పడే ప్రభావం.. ఇలాంటి అన్ని అంశాలపై సస్టెయినబుల్ అగ్రికల్చర్ సెంటర్ డైరెక్టర్ సమరేందు మహంతి ఆధ్వర్యంలోని టీమ్ రాష్ట్రవ్యాప్తంగా స్టడీ చేసింది.

వాతావరణ ప్రతికూలతల కారణంగా వరి దిగుబడి గత ఖరీఫ్ సీజన్ సగటుతో పోలిస్తే ఈసారి బాగా తగ్గుతుందని, అది ప్రజలు ఓపెన్ మార్కెట్ నుంచి కొనే బియ్యం ధరలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు వడ్ల దిగుబడిలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న తెలంగాణ.. ఈసారి కూడా ఉండొచ్చని, కానీ దిగుబడి విషయంలో మాత్రం గతంకంటే తగ్గొచ్చని పేర్కొన్నది. వడ్లు ఎక్కువగా పండించే నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం తగ్గడంతో దిగుబడి తగ్గి, బియ్యం ధరలు పెరగడానికి దారితీసే అవకాశం ఉన్నట్లు వివరించింది.

Telangana Paddy Cultivation
Telangana Paddy Cultivation

రాష్ట్రంలో పంటల సాగు (ఎకరాల్లో)

పంట                            గతేడాది                    ఈసారి
వరి                             67,24,585               56,59,467
పత్తి                             45,91,306               48,33,102
కందులు                         4,91,690                5,58,145
పెసర్లు                              61,696                1,60,674
జొన్న                                34,567                   35,418
మినుములు                        28,706                   71,287
కొర్రలు, సామలు                        63                     1,917
సజ్జలు                                   152                     1,052
రాగులు                                  389                        930

Also Read:  బీఆర్ఎస్ బీజేపీ క్రెడిట్ ఫైట్.. ప్రజల్లో కొత్త డౌట్?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>