అటా.. ఇటా.. సీఈసీ వివాదంపై బీఆర్ఎస్ ఎటు..?

కలం, తెలంగాణ బ్యూరో: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) విషయంలో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా సీజేపీ యువత సైతం ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్.. ఈ నెల 28న దేశవ్యాప్త నిరసనలు, ర్యాలీలకు పిలుపునిచ్చింది. మరోవైపు అభిశంసన కోసం కూడా కసరత్తు చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎలాంటి వైఖరి అవలంభిస్తుందనే చర్చ రాష్ట్రంలో మొదలైంది.

సీఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా పలు పార్టీలు చేపట్టే నిరసనలు, ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా? లేదా సైలెంట్‌గా ఉంటుందా? మద్దతు ఇస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనంటూ రాజకీయంగా బీజేపీ టార్గెట్ చేసే అవకాశమున్నది. ఇవ్వకపోతే బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ-టీమ్’గా పని చేస్తున్నదంటూ కాంగ్రెస్ విమర్శలు చేయడానికి ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ఈ అంశంలో బీఆర్ఎస్ పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనక గొయ్యి..’ అన్నట్లుగా తయారైంది. దీంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ స్టాండ్ కీలకం

సీఈసీ విషయంలో బీఆర్ఎస్ (CEC BRS) ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అది రాజకీయంగా ఇబ్బందికరంగా మారనున్న పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉంటుందా? లేక ఒంటరి పోరాటం చేస్తుందా అనేది గమనార్హం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఆ పార్టీపై ప్రభావం చూపే అవకాశమున్నది. గులాబీ పార్టీ తీసుకునే నిర్ణయం రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయంగా అస్త్రాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కేసీఆర్ కత్తి మీద సాము లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ ప్రజాక్షేత్రంలో పుంజుకోవాలని చూస్తున్న తరుణంలో సీఈసీ వ్యవహారం తెరమీదకు వచ్చింది. నిరసనల్లో పాల్గొన్నా, దూరంగా ఉన్నా రాజకీయంగా ఆ మేరకు చిక్కులను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. సీఈసీని తప్పించేలా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలోని విపక్షాలన్నీ ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానానికి బీఆర్‌‌ఎస్ మద్దతు ఇస్తుందా? లేదా?.. అన్నది పొలిటికల్‌గా కీలకం కానున్నది. మద్దతు ఇచ్చినా, వ్యతిరేకించినా ‘బొమ్మాబొరుసు’ అని బీజేపీ, కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తటస్థమా? ఒంటరి పోరాటామా?

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ విషయంలో బీఆర్ఎస్ స్పష్టమైన అభిప్రాయాలనే వెల్లడించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ పని తీరు ఆందోళన కలిగిస్తున్నదని, నియంతృత్వ పోకడలకు పోతున్నదంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘సర్’ ప్రక్రియలో అక్రమాలు, లోపాలు జరిగాయని, అర్హులైన అనేకమంది ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ తొలగించిందంటూ చాలాసార్లు కామెంట్ చేశారు.

తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మిగిలిన ఇద్దరు కమిషనర్ల మధ్య ఏకాభిప్రాయం లేదని, పలు నిర్ణయాల్లో విభేదించారంటూ వార్తలు వస్తున్న తరుణంలోనూ కేటీఆర్ స్పష్టమైన అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. “ఈసీ విశ్వసనీయతపై అనుమానం నెలకొన్నది. ఓట్ల నమోదు, తొలగింపు, పునరుద్ధరణ నిర్ణయాలు ప్రశ్నార్థకంగా మారాయి. మనం అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతున్నది” అంటూ వ్యాఖ్యానించారు. ఈసీ తీరును, సీఈసీ వ్యవహారాన్ని తప్పుబట్టిన నేపథ్యంలో అభిశంసన విషయంలో కాంగ్రెస్ పిలుపుకు స్పందించి బీఆర్ఎస్ నిరసనల్లో పాల్గొంటుందా? లేక తటస్థంగా వ్యవహరించి ఒంటరిగా కొట్లాడుతుందా? అనేది కీలకంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>