కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా అహంకారం తగ్గడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చామని కేటీఆర్ చెప్పుకుంటున్నాడని విమర్శించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ తలకాయ పెట్టినా ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్.. నిన్ను వదిలిపెట్టం రాసుకో అంటూ హెచ్చరించారు. తెలంగాణ అంటే తామే అన్న కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పాతాళానికి తొక్కారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సెప్టెంబర్, మార్చి కేటీఆర్‌కు బాగా గుర్తుంటుంది అంటూ ఎద్దేవా చేశారు.
కేటీఆర్‌ను గజ్జున వణికిస్తాం..
ఈ సెప్టెంబర్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో అడుగుపెట్టబోతున్నాడని అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు. తమ సీఎం రేవంత్ రెడ్డి మొదటి అడుగు సిరిసిల్లపై, రెండో అడుగు సిద్ధిపేటపై, మూడో అడుగు గజ్వేల్‌పై వేయబోతున్నారని అన్నారు.కేటీఆర్‌ను గజ్జున వణికిస్తామని.. కేసీఆర్ కారిడార్‌ను బద్దలు కొట్టడమే లక్ష్యమని విమర్శించారు. తన బంధువులు, అనుచరులతో కేసీఆర్ నిర్మించుకుంటున్న సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. గజ్జున వణికించిన తెలంగాణ ప్రజలందరినీ అహంకారం, బలుపుతో కేటీఆర్ వానపాముల్లా చూస్తున్నాడని.. కాలనాగుల్లాంటి బీఆర్ఎస్ నాయకులను ఆ వానపాములే ఓడించాయని చెప్పారు.
కేటీఆర్‌ది భస్మాసుర హస్తం..
కేటీఆర్.. మమ్మల్ని బెదిరిస్తావా? ముందు నీ భవిష్యత్తును తేల్చుకో అంటూ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ గురించి కాదని.. ముందు తమ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ది భస్మాసుర హస్తమని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో లేడని.. ఫామ్‌హౌస్ గడిలో ఉన్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ డీఎన్‌ఏలోనే దళిత వ్యతిరేకత, అహంకారం ఉన్నాయిని. అందుకే శుద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డితో పోటీకి వచ్చేది ఎవరో బీఆర్ఎస్ పార్టీ వాళ్లు తేల్చుకోవాలన్నారు. దేశంలో ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోయిందని.. ఈసారి ఓటమి ఖాయమని అభిప్రాయపడ్డారు.

