తెలంగాణలో మరో రాజకీయ సమరం.. రేసులో నిలిచేదెవరు?

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి రంగం సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది మార్చిలో పదవీకాలం ముగియనున్న మహబూబ్‌నగర్, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ (TG MLC Elections) ప్రారంభం కావడంతో.. ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌కు ఈ రెండు స్థానాలు ప్రతిష్టాత్మకంగా మారగా.. శాసనమండలిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బీఆర్ఎస్‌కు ఈ ఎన్నికలు మరో పరీక్షగా మారనున్నాయి. గతంలో గ్రాడ్యుయేట్ స్థానాల్లో తనకున్న పట్టును నిలబెట్టుకోవాలని బీజేపీ కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్నది.

రెండ్రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య 17గా ఉండగా.. కాంగ్రెస్కు 12, బీజేపీకి 3, ఎంఐఎంకు 2, సీపీఐకి 1, టీజేఎస్కు 1, పీఆర్టీయూకు 1 సభ్యుడు ఉన్నారు. కౌన్సిల్లో బీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు స్థానాలను గెలుచుకోవడం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.

వరంగల్ నియోజకవర్గానికి ఇన్చార్జ్‌గా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మహబూబ్‌నగర్ ఇన్చార్జ్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ గత రెండు రోజులుగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వాటిని వడపోసి ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లను ఫైనల్ చేయనున్నారు. నేడో, రేపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఒక్కో గ్రాడ్యుయేట్ నియోజకవర్గం దాదాపు 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటంతో.. ఆర్థికంగా బలంగా ఉన్న ఆశావహులకే అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతున్నది. రెడ్డి, బీసీ సామాజికవర్గాలకు ఒక్కో టికెట్ కేటాయిస్తారా? లేక గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థుల ప్రాతిపదికన ఎంపిక చేస్తారా? అనే చర్చ సాగుతున్నది.

భారీగా దరఖాస్తులు

2024లో వరంగల్‌లో కాంగ్రెస్ మద్దతుతో తీన్మార్ మల్లన్న విజయం సాధించగా.. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌కు దూరమయ్యారు. దీంతో ఈసారి కాంగ్రెస్ సొంత అభ్యర్థిని బరిలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధులు లోకేశ్ యాదవ్, చనగాని దయాకర్, జర్నలిస్ట్ కోటాలో పీవీ శ్రీనివాస్ (ఇన్ఫర్మేషన్ కమిషన్ సభ్యుడు), ఖమ్మం ప్రాంతానికి చెందిన సీనియర్ నేత రామిరెడ్డి దామోదర్‌రెడ్డి, సర్వోత్తమ్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి మిత్రుడిగా పేర్కొంటున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన సింగారపు ఇందిర తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం.

మహబూబ్‌నగర్ నుంచి పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గౌరీ సతీశ్, జర్నలిస్ట్ కోటాలో వేణుగోపాల్‌రెడ్డి (ఇన్ఫర్మేషన్ కమిషన్ సభ్యుడు), దేవరకద్ర కాంగ్రెస్ నేత భీమ్‌భరత్, పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ నేత గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

రాకేశ్ రెడ్డి పైనే బీఆర్‌ఎస్ ఆశలు?

వరంగల్ నుంచి 2024లో మల్లన్నకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచి స్వల్ప తేడాతో ఓడిన ఏనుగుల రాకేశ్ రెడ్డి ఈసారి కూడా బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, వరంగల్ జిల్లాకు చెందిన నేత కేతిరెడ్డి వాసుదేవరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులతో వరుసగా సమావేశమవుతూ.. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాకేశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డిలో ఒకరిని ఎంపిక చేస్తారా? లేక కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

అధికారం కోల్పోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం వంటి కారణాలతో కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్‌ఎస్‌లో టికెట్ కోసం నేతల పోటీ తక్కువగా ఉందని పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లలో బీఆర్‌ఎస్ వేగం పెంచింది. రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచించడంతో పాటు.. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది.

బీజేపీ నుంచి కాసం, రామచందర్‌రావు?

వరంగల్ స్థానం నుంచి పలుమార్లు పోటీ చేసి ఓడిపోయిన ప్రేమేందర్‌రెడ్డికి ఈసారి అవకాశం తక్కువేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన, రాష్ట్ర పార్టీ మీడియా ప్యానలిస్టు పుల్లారావు యాదవ్ పేరు వినిపిస్తున్నది. ఈ నియోజకవర్గంలో బీజేపీ మిగతా ప్రాంతాలతో పోలిస్తే బలహీనంగా ఉందని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇదిలా ఉండగా, వరంగల్ కేంద్రంగా సంస్థాగత కార్యదర్శి దశరథ్‌ను అధిష్ఠానం నియమించడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ నియోజకవర్గం పరిధిలోని వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పార్టీని ఏ విధంగా నడిపిస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మహబూబ్‌నగర్ స్థానానికి గతంలో బీజేపీ నేతలు వి. రామారావు, ఎన్. రామచందర్‌రావు ప్రాతినిధ్యం వహించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రామచందర్‌రావు.. బీఆర్‌ఎస్ అభ్యర్థి, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి చేతిలో 36,580 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు షాద్‌నగర్, శంషాబాద్ కేంద్రంగా విద్యాసంస్థలు నిర్వహిస్తున్న పార్టీ సీనియర్ నేత శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్, మరో సీనియర్ నేత ప్రకాశ్‌రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్ణాటక సహప్రభారి కాసం వెంకటేశ్వర్లు పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన రామచందర్‌రావు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో.. ఆయన మరోసారి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 24న ఆయన అధ్యక్షతన ఎన్నికల సన్నాహక సమావేశం జరిగినట్లు సమాచారం అందుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>