దేశమంతా ఎన్నికల హడావుడి మొదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ చెరువులో 500 ఓటర్ కార్డులు దొరకడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో జరిగింది. ఓటర్ కార్డులను గుర్తించిన అధికారులు.. అసలు అవి ఎక్కడివి? ఇక్కడికి ఎలా వచ్చాయి? చెరువులో ఎందుకు పడేశారు? ఎవరు పడేశారు? వంటి కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛతర్‌పుర్ జిల్లా బిజావర్‌లోని చెరువులో చెత్తను తొలగిస్తున్న సమయంలో ఓటర్ కార్డులు లభ్యమయ్యాయి. వాటిని గుర్తించిన వెంటనే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కార్డులు ఓటర్లకు చేరకముందే మాయమై ఉండొచ్చని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
Madhya Pradesh | ఈ ఘటన స్థానికంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. బీజేపీ ప్రభుత్వం చేతకానితనం, వైఫల్యానికి చెరువులో ఓటర్ కార్డులు లభించడం నిదర్శనం అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరగడాలని, దీనికి కారుకులు ఎవరో వారికి శిక్ష పడాలని కాంగ్రెస్ నేత దీప్తి పాండే విజ్ఞప్తి చేశారు. అయితే అన్ని కార్డులను భద్రపరిచామని, ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని అధికారులు చెప్పారు. అసలు అవి అసలైన కార్డులా? లేక దొంగ ఓటర్ కార్డులా? అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అంతేకాకుండా అసలు అవి ఎక్కడి కార్డులన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది.

