కలం, వెబ్ డెస్క్: రోజురోజుకు సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మండే ఎండలతో జనాల ఎనర్జీని తాగేస్తున్నాడు. ఈ ఎండ ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి ఈ మండే ఎండల్లో ఆరోగ్యంగా ఉండాలంటే? ఎండల వల్ల వస్తున్న వడదెబ్బ, డీహైడ్రేషన్, సన్‌బర్న్ వంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలి? ఇలాంటి సందేహాలు దాదాపు అందరి మదిలో మెదులుతున్నాయి. కానీ ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం మండే ఎండల్లో ఐదు టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు. మరి ఇంతకీ ఆ టిప్స్ (Summer Tips) ఏంటో తెలుసా..!
హైడ్రేషన్ చాలా ముఖ్యం
వేసవిలో చెమట ఎక్కువగా పడటంతో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనివల్ల అలసట, నీరసం వస్తాయి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. నీటితో పాటు ఇతర ద్రవాలు కూడా తీసుకోవడం మంచిదని తెలిపారు. కలుషిత నీటిని తాగితే డయేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
సరైన ఆహారం
వేసవిలో తేలికపాటి, పోషకాహారం తీసుకోవడం అవసరం. సీజనల్ పండ్లు, కూరగాయలు, సలాడ్లు, జ్యూస్‌లు, పెరుగు, మొలకలు వంటి ఆహారాలు శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి. ఇవి శరీరాన్ని తేలికగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
మసాలా తగ్గించాలి
వేసవిలో కారంగా, మసాలాగా ఉండే ఆహారం తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. అందుకే తక్కువ నూనె, తేలికపాటి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో శరీరం అలసటకు గురవుతుంది. రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర తీసుకోవడం అవసరం. రాత్రి తేలికపాటి ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి నిద్ర కూడా బాగా పడుతుంది.
ఎండ నుంచి రక్షణ
వేసవిలో సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బయటకు వెళ్లేటప్పుడు SPF ఉన్న సన్‌స్క్రీన్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది చర్మాన్ని సన్‌బర్న్ నుంచి రక్షిస్తుంది. చర్మ సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని తెలిపారు.
Read Also: దంతాలు దృఢంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Follow Us On: X(Twitter)

