కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda)లోని వడ్డెపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం జరిపిన సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏ డాక్యుమెంట్‌కు ఎంత లంచం ఇవ్వాలనే విషయం సబ్ రిజిస్ట్రార్లు తమ వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ రైటర్లతో జరిపిన చాటింగ్‌లో బయటపడింది. అంతేకాకుండా గడిచిన ఏడాది కాలంలో ఏజెంట్ల ద్వారా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు రామ్ నర్సింహారావు, ఆనంద్ సుమారు రూ. 42,03,125 లావాదేవీలు నడిపినట్లు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో 20 మంది నకిలీ ఏజెంట్లను గుర్తించి, 70 డాక్యుమెంట్లకు సంబంధించి లెక్కల్లో చూపని రూ.47,450లను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ నివాసంలో జరిపిన తనిఖీల్లో రూ.26,61,540 నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండితో పాటు కపిల్ చిట్స్‌లో రూ.30 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

