కలం, నేషనల్ డెస్క్ : పశ్చిమబెంగాల్‌లో (West Bengal) రాష్ట్రపతి పాలన తప్పదా?.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోనున్నదా?.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఆ రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో తెలియని అనిశ్చితి నెలకొన్నది. ఎలక్షన్ షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ శాంతిభద్రతలు అదుపులో లేకపోతే పోలింగ్ ప్రశాంతంగా జరిగే అవకాశాలు ఉండవన్నది అటు ఎలక్షన్ కమిషన్.. ఇటు సుప్రీంకోర్టు అభిప్రాయం ఈ పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రభుత్వం స్థానంలో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలపై ఢిల్లీ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తేవడంపై ఏం చేయాలన్నది ఈ నెల 6 తర్వాత కొంత స్పష్టత రావచ్చన్నది ఢిల్లీ వర్గాల సమాచారం.
వరుస హింసాత్మక ఘటనలతో అలర్ట్ :
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ (SIR)పై తృణమూల్ కాంగ్రెస్ భగ్గుమన్నది. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. బూత్ లెవల్ ఆఫీసర్లను తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తలు టార్గెట్ చేశారు. భారీ స్థాయిలో ఓటర్ల పేర్లను జాబితా నుంచి తప్పించడానికి ఎలక్షన్ కమిషన్‌ను బీజేపీ పావుగా వాడుకుంటున్నదన్నది తృణమూల్ ఆరోపణ. దాదాపు కోటింబావు మంది ఓటర్లను తొలగించారని ఆరోపించింది. ఎలక్షన్ కమిషన్ మాత్రం దాదాపు 80 లక్షల మంది పేర్లను వెరిఫై చేసిన తర్వాత డిలీట్ చేయక తప్పలేదని వివరణ ఇచ్చింది. ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండడంతో బెంగాల్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొన్నది. తాజాగా ఏడుగురు జ్యుడిషియల్ ఆఫీసర్లను దాదాపు తొమ్మిది గంటల పాటు నిర్బంధించడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిపోర్టు పంపాల్సిందిగా రాష్ట్ర సర్కార్‌ను ఆదేశించింది.
బెంగాల్ సీఎస్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం :
ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ‘సర్’ పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ వేసింది. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. దానికి కొనసాగింపుగా ‘సర్’ పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ అధికారుల బృందాన్ని బెంగాల్‌కు పంపింది. ఆ ప్రకారం మాల్డా జిల్లాలో పర్యటిస్తున్న జ్యుడిషియల్ ఆఫీసర్ల బృందాన్ని తృణమూల్ కార్యకర్తలుగా అనుమానిస్తున్నవారు నిర్బంధించడాన్ని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ పొలిటికల్ భాష మాట్లాడుతున్నారంటూ మందలించింది. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పోలీస్ యంత్రాంగం విఫలమైందని వ్యాఖ్యానించింది. జ్యుడిషియల్ ఆఫీసర్లను భయభ్రాంతులకు గురిచేయడం న్యాయ వ్యవస్థ అధికారాన్ని సవాలు చేయడమేనని, ఇది క్రిమినల్ కంటెంప్ట్ కిందకు వస్తుందని హెచ్చరించింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏ ద్వారా విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఈ నెల 6న విచారణతో క్లారిటీ :
బెంగాల్‌లోని (West Bengal) తాజా పరిస్థితులపై సుప్రీంకోర్టులో ఈ నెల 6న తదుపరి విచారణ జరగనున్నది. ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశించడంతో వారిద్దరూ అటెండ్ కానున్నారు. విచారణ అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ నందిని చక్రవర్తిని, డీజీపీ పీయూష్ పాండేలను విధుల నుంచి తప్పించింది. వీరితో పాటు పది మంది కలెక్టర్లు, ఐదుగురు డీఐజీలు, పన్నెండు మంది ఎస్పీలను బదిలీ చేసింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు న్యాయాధికారులకు, పోలింగ్ సిబ్బందికి రక్షణగా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా కేంద్ర బలగాలను రప్పించుకోవచ్చని ఈసీకి సుప్రీంకోర్టు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. మరోవైపు శాంతిభద్రతల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షిస్తున్నది. దీంతో సుప్రీంకోర్టు జోక్యంతో పరిస్థితులు చక్కబడతాయా?.. లేక రాష్ట్రపతి పాలన విధించక తప్పదా?.. వీటిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానున్నది.
Read Also: తెలంగాణ DNAలోనే టెక్స్ టైల్ ఉంది:సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

