కలం, వెబ్ డెస్క్: రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తనను తొలగించడంపై రాఘవ్ చద్దా (Raghav Chadha) తొలిసారి స్పందించారు. తన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించడంపై ఆయన షాకయ్యారు. పార్లమెంటులో ప్రజా సమస్యలను లేవనెత్తడమే తాను చేసిన నేరమా? అని ఆయన ప్రశ్నించారు. నేను ఏం తప్పు చేశాను? ప్రజల గొంతుక వినిపిస్తున్నందుకు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటూ ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో విమానం టికెట్ల ధరలు, గిగ్ వర్కర్ల సమస్యలు, ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్స్, మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం వంటి అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించి రాఘవ్ చద్దా (Raghav Chadha) దేశ వ్యాప్తంగా ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఉపయోగపడే అంశాలనే సభలో ప్రస్తావించానని గుర్తు చేశారు. తన ప్రసంగాలు నిలిపివేయాలని ఆప్ (AAP) నాయకత్వం రాజ్యసభ సెక్రటేరియట్‌కు సూచించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన మౌనాన్ని ఓటమిగా భావించవద్దని రాఘవ్ చద్దా హెచ్చరించారు.
రాఘవ్ చద్దాను కీలక పదవి నుంచి తొలగించడం పార్టీలో అంతర్గత విభేదాలను స్పష్టం చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిర్దోషులుగా జైలు నుంచి విడుదలైన అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మనీశ్ సిసోడియాలను రాఘవ్ చద్దా పరామర్శించలేదని, కనీసం వారిని కలిసేందుకు కూడా ప్రయత్నించలేదని ఆరోపిస్తూ ఆయనపై ఆప్ నాయకత్వం చర్యలు తీసుకుంది. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడమే కాకుండా ఆయన ప్రసంగాలు నిలిపివేయాలని రాజ్యసభ సెక్రటేరియట్‌కు సూచించింది.
Read Also: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన?.. తాజా హింసతో చర్చలు..
Follow Us On: Facebook

