ఓబీసీల లెక్కలు తేల్చాల్సిందే.. ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానన్న వీహెచ్

కలం, వెబ్​ డెస్క్​ : కేంద్ర ప్రభుత్వం చేపట్టదలచిన డిజిటల్ సెన్సెస్ ప్రక్రియపై మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హనుమంతరావు (Hanumantha Rao) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో కుల గణన నిర్వహించే సమయంలో కేవలం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే సేకరిస్తూ ఓబీసీలను విస్మరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఓబీసీలు (OBC) కూడా దారిద్య్రరేఖకు దిగువన మగ్గుతున్నారని, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులతో కూడిన వివరాలను సేకరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కేవలం హిందువుల ఓట్లతో గెలవాలని చూస్తున్న బీజేపీకి, ఓబీసీల ప్రయోజనాలు పట్టవా అని ఆయన నిలదీశారు.

డిజిటల్ సెన్సెస్‌లో (Digital Census) ఇంటి నిర్మాణం, స్లాబ్ నాణ్యత వంటి అనవసర వివరాలను కోరడం సామాన్యులను ఇబ్బంది పెట్టడమేనని వీహెచ్ అభిప్రాయపడ్డారు. కేంద్రం నిర్వహిస్తున్న ఈ గణన ఒక బోగస్ ప్రక్రియ అని మండిపడ్డారు. ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తాను చేసిన డిమాండ్‌పై ఇప్పటివరకు స్పందన లేకపోవడం విచారకరమన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కనుసన్నల్లోనే నడుస్తోందని, అందుకే ఓబీసీలను ఈ జాబితా నుంచి పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు.

ఓట్లు వేయడానికి ముందుండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల లెక్కలు ప్రభుత్వానికి ఎందుకు అక్కర్లేదని వీహెచ్ ప్రశ్నించారు. ఇప్పుడు మనం మేల్కొనకపోతే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్లవుతుందని, బీసీల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే రేపు (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మేధావులు, బీసీ సంఘాల నాయకులతో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఇది బీసీల అస్తిత్వం కోసం చేయాల్సిన యుద్ధమని హనుమంతా రావు (Hanumantha Rao) పిలుపునిచ్చారు.

Read Also: దొడ్డి కొమురయ్య నేటి తరాలకు స్ఫూర్తిదాయకం : మంత్రి రాజనర్సింహ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>