ఎన్టీఆర్ టు కవిత.. నేతలందరిదీ అదే మాట..

కలం, తెలంగాణ బ్యూరో : ఓట్ల కోసం, ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ నాయకులు సర్కస్ ఫీట్లు చేస్తారు. పడరాని పాట్లు పడతారు. రకరకాల హామీలు ఇస్తారు. అనేక అంశాలను ప్రస్తావిస్తారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలంగాణ పాలిటిక్స్ లో (Telangana Politics) ఇది కామన్ ప్రాక్టీస్. ఎన్టీ రామారావు మొదలు రేవంత్‌రెడ్డి వరకు అందరిదీ అదే ధోరణి. ఇప్పుడు కొత్తగా పార్టీ పెడుతున్న కల్వకుంట్ల కవిత సైతం అదే రాగం అందుకున్నారు. ‘నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా..” ఇదే వీరందరి నోట వినిపించిన మాట. ఒకవైపు నక్సలైట్ ఉద్యమం అంతరించిందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు వేదికగా మార్చి 30న ప్రకటించారు. గద్దర్ పేరును ప్రస్తావించి కాంగ్రెస్‌కు నక్సలైట్లతో సంబంధాలున్నాయని వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు (బీజేపీ మినహా) వేర్వేరు సందర్భాల్లో నక్సలైట్ల ఎజెండాను సమర్ధించాయి. రాజకీయాల కోసం నక్సలైట్ అంశాన్ని ప్రస్తావించడం తెలంగాణలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ.

నాలుగు దశాబ్దాల క్రితమే ఎన్టీఆర్.. :

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు (NTR) 1980వ దశకంలోనే నక్సలైట్లను దేశభక్తులుగా కీర్తించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటించినప్పుడు ‘నక్సలైట్లు నిజమైన దేశభక్తులు.. వారు ప్రజల కోసం త్యాగాలు చేశారు.. పేదల కోసమే వారు ఆ మార్గం ఎంచుకున్నారు..’ అంటూ వ్యాఖ్యానించారు. భూస్వామ్య వ్యవస్థ (దొరల సంస్కృతి)కి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసమే వారు నక్సలైట్లుగా మారారని వ్యాఖ్యానించారు. ప్రజలకు నిస్వార్థ సేవ చేయడానికి వారు అడవి బాట పట్టారు.. గరీబోళ్ళను ఆర్థికంగా డెవలప్ చేయాలన్నది వారి లక్ష్యం.. అంటూ ప్రచారం సందర్భంగా పలు సభల్లో ప్రస్తావించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్ల ఏరివేతపై దృష్టి పెట్టారు. తీవ్ర స్థాయిలో పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించారు. ఎన్‌కౌంటర్లు రెగ్యులర్ యాక్టివిటీస్‌గా మారాయి.

నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా : కేసీఆర్

“నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా.. ఇద్దరి లక్ష్యమూ ఒక్కటే.. రాష్ట్రాన్ని విముక్తి చేయడం, అభివృద్ధి చేయడం.. కానీ దారులే వేరు..” అంటూ 2004 ఎన్నికల క్యాంపెయిన్‌లో వరంగల్‌లో కేసీఆర్ (KCR) కామెంట్ చేశారు. సామాజిక, ఆర్థిక సమస్యలే యువతను నక్సలైట్ మార్గం వైపు మళ్లించాయంటూ తన వాదనను కేసీఆర్ సమర్ధించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు, దళితులకు మూడెకరాల భూమి లాంటి పథకాలు అమలవుతున్నందున ఇక నక్సలైట్ల అవసరం సమాజానికి లేదంటూ వారిపై అణచివేత ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ సాగర్, శృతి అనే ఇద్దరు మావోయిస్టులు పోలీసు ఎదురుకాల్పుల్లో చనిపోయారు. మావోయిస్టు కార్యకలాపాలకు తావులేకుండా ఒకవైపు ఇంటెలిజెన్స్ విభాగాన్ని, మరోవైపు పోలీసు వ్యవస్థను విస్తృతంగా వినియోగించారు. అప్పటివరకూ నక్సలైట్ ఎజెండా గురించి గొప్పగా చెప్పుకుని ఆ తర్వాత నిర్బంధాన్ని ప్రయోగించారు.

మా పార్టీదీ నక్సలైట్ ఐడియాలజీయే : రేవంత్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2023లో అప్పటి పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సైతం నక్సలైట్ల అంశంపై పాజిటివ్‌గా స్పందించారు. “కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కూడా నక్సలైట్ల మౌలిక ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నది.. దున్నేవాడికే భూమి ఇవ్వాలన్నది నక్సలైట్ల నినాదం.. ఇందిరాగాంధీ పాలనలో (ఇందిరమ్మ రాజ్యం) కూడా ఆ లక్ష్యం కోసమే సంక్షేమ పథకాలు ఉనికిలోకి వచ్చాయి.. భూస్వామ్య సంస్కృతిని నిర్మూలించాలన్న నక్సలైట్ల లక్ష్యానికి అనుగుణంగా కేసీఆర్ గతంలో ప్రస్తావించి చివరకు నయా భూస్వామ్య వ్యవస్థను సృష్టించారు..” అని విమర్శించారు. రెండున్నరేళ్ల పాలనలో మూడు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. తాజాగా ఆపరేషన్ కగార్‌లో భాగంగా లొంగిపోవాలంటూ పిలుపునిచ్చారు. ఐదారు నెలల కాలంలోనే వందలాది మంది ఆయుధాలతో సహా సరెండర్ అయ్యారు.

కల్వకుంట్ల కవిత సైతం నక్సలైట్ సమర్ధన :

“నక్సలైట్ భావజాలాన్ని ఆయుధాల ద్వారా నిర్మూలించలేం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ (Operation Kagar) లాంటి సైనిక చర్యల ద్వారా ఆ భావజాలాన్ని తుదముట్టించలేవు.. వెంటనే ఈ సైనిక చర్యలను ఆపివేయాలి.. దానికి బదులుగా శాంతి చర్చలు జరపాలి.. కేసీఆర్ సైతం నక్సలైట్ల సమస్య శాంతిభద్రతల సమస్యగా చూడకుండా సామాజిక, ఆర్థిక సమస్యగా భావించారు.. ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చు.. భూమిలేని పేదలకు సాగుభూమి ఇవ్వడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పేదలు ఆత్మగౌరవంతో బతికేలా పరిస్థితుల్ని సృష్టించడం.. ఇలాంటివన్నీ ఆ సమస్యకు పరిష్కారంగా ఉంటాయి..” అని కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చాలామంది నక్సలైట్లు లొంగిపోవడానికి కారణం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, నక్సలైట్లు కోరుకున్న లక్ష్యం కేసీఆర్ పరిపాలన ద్వారా నెరవేరడమే అని అన్నారు. మాజీ మావోయిస్టులు వస్తే వారిని తమ పార్టీలో చేర్చుకుంటాం అని సంకేతం ఇచ్చారు.

రాజకీయ పార్టీల ఎలక్షన్ స్టంట్‌లో ‘నక్సలైట్’ :

రాజకీయ పార్టీలు ఎన్నికల స్టంట్‌లో భాగంగా నక్సలైట్ అంశాన్ని ప్రస్తావించడం ఐదు దశాబ్దాలుగా తెలంగాణలో జరుగుతున్న ప్రాక్టీస్. ఎన్టీఆర్ మొదలు తాజాగా కవిత వరకు అందరూ నక్సలైట్లను కీర్తించడం, ఆ సమస్యను శాంతిభద్రతల సమస్యగా కాకుండా సామాజిక, ఆర్థిక అంశంగా పరిగణించడం, ఆ మేరకు గంభీర ప్రకటనలు చేయడం రెగ్యులర్‌గా కొనసాగుతున్న ప్రక్రియగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి విరుద్ధమైన కార్యాచరణ కొనసాగించడం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా రొటీన్‌ ఆచరణగా మారింది. ఇప్పుడు రాజకీయ పార్టీ పెడుతున్న కవిత సైతం ఎన్టీఆర్, కేసీఆర్, రేవంత్‌రెడ్డి తరహాలోనే నక్సలైట్ సమస్యను ప్రస్తావించారు. ఒక అడుగు ముందుకేసి మాజీ మావోయిస్టులు వస్తే పార్టీలో స్థానం కల్పిస్తాననే హామీని ఇచ్చారు. ఓటు బ్యాంకు కోసం ఆయా రాజకీయ పార్టీలకు నక్సలైట్ సమస్య ఓ పొలిటికల్ (Telangana Politics) అస్త్రంగా మారింది.

Read Also: పదేండ్లలో 400 శాతం పెరిగిన లిక్కర్ ఇన్‌కమ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>