కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ పెరిగిపోయిందని, ఒకేసారి 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచేసి విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ఈ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, దీని కోసం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఫీజుల నియంత్రణ చట్టం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, బిల్లు పాస్ చేయాలని సూచించారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్‌లో తెలంగాణ వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏటా 8 శాతానికి మించి ఫీజు పెంచడాన్ని ప్రభుత్వం నిరోధించాలని కోరారు.
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల విషయంలో గతంలో బీఆర్ఎస్ ఇలాంటి నిర్లక్ష్యపు విధానాన్నే ప్రోత్సహించిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే వ్యవహరిస్తే బీఆర్ఎస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. నారాయణ, చైతన్య లాంటి స్కూల్స్‌లో ఫుడ్ సేప్టీ, టీచర్ల పీఎఫ్ లాంటి అంశాలపై విచారణ చేయాలని కవిత కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాకపోతే జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో స్కూళ్ల స్వరూపం
రాష్ట్రంలో మొత్తం 39,641 స్కూల్స్ ఉంటే అందులో దాదాపుగా 62 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని కవిత తెలిపారు. వీటిలో 27,581 ప్రభుత్వ పాఠశాలలు, 12,061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది, ప్రైవేట్లో 38 లక్షల మంది చదువుతున్నారని వెల్లడించారు. ప్రైవేట్ లో మళ్లీ 350 స్కూల్స్ స్పెషలైజ్డ్ గా ఉన్నాయని, వాటిల్లో 3 లక్షల మంది చదువుతున్నారని తెలిపారు. నారాయణ, చైతన్య లాంటి 12 వందల కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయని తెలిపారు. వాటిల్లో 5 లక్షల మంది చదువుతున్నట్లు వెల్లడించారు. 236 బడ్జెట్ స్కూల్స్ ఉంటే వాటిలో 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం 42 వేలు ఇస్తుందన్నారు.
ఏప్రిల్ కూడా రాకముందే ప్రైవేట్ స్కూల్స్ 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచుతున్నాయని కవిత (Kavitha) ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు ఫీజు లక్ష రూపాయలు ఉంటే ఇప్పుడు మరో 30 వేలు బర్డెన్ కాబోతోందన్నారు. దీనిపై హైదరాబాద్‌లో చాలా స్కూల్స్ వద్ద పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి నెల ఫీజు తీసుకోవాల్సింది పోయి ఒకేసారి 60 శాతం ఫీజు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర భారం పడే పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చేయలేదంటూ గతంలో సీఎం రేవంత్ విమర్శించారని, మరి ఈ ప్రభుత్వం వచ్చి ముూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు దీనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఇది ప్రభుత్వానికే సిగ్గుచేటు అని విమర్శించారు.
Read Also: BRSలోకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి: ముహూర్తం ఫిక్స్ !
Follow Us On: X(Twitter)

