కలం, సెంట్రల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఆ దేశానికే పరిమితం కాలేదు. ‘తను చెడ్డ కోతి వనమెల్లా..’ చందంగా ఆయన ప్రకటించిన ‘టారిఫ్’ (Tariffs) ప్రభావం అన్ని దేశాలపై పడింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మరోవైపు అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ కూడా టారిఫ్ కష్టాలు ఎదుర్కోక తప్పలేదు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని అయోమయం కంటిన్యూ అవుతున్నది. ఏ క్షణం ఎలాంటి బాంబ్ పేలుస్తారోనన్న టెన్షన్ వెంటాడుతున్నది. ఇక హెచ్-1 బీ వీసా రూల్స్ మార్చడం, ఇరాన్‌పై కాలుదువ్వడం.. ఇలాంటి నిర్ణయాలు మొత్తం ప్రపంచ దేశాలనే ఇబ్బందుల్లోకి నెట్టింది. ట్రంప్ టారిఫ్‌లతో నిజామాబాద్ పసుపు మొదలు వరంగల్ మిర్చి రైతుల వరకు ఏదో ఒక రూపంలో కష్టాల్లో పడ్డారు.
ఇండియా నుంచి సరఫరా చేసే పప్పు, ఉప్పు, బియ్యం సహా అనేక వస్తువులపై టారిఫ్ పేరుతో భారీగానే అమెరికాకు చెల్లించుకోక తప్పలేదు. దీంతో అమెరికాలోని ఇండియన్స్ సైతం మూడు నాలుగింతలు ఎక్కువ చెల్లించి వాటిని కొనాల్సి వస్తున్నది. సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా ట్రంప్ తీరు మారలేదు. హెచ్-1 బీ వీసా రూల్స్‌లో ఇష్టమున్నట్లు మార్పులు చేయడంతో అమెరికాలోని ఇండియన్స్ ఇక్కడికి రాలేక.. తమ వాళ్లను చూసేందుకు ఇక్కడివాళ్లు అక్కడికి వెళ్లలేక ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఇండియన్ టెకీల జాబ్ ఎప్పుడు పోతుందో తెలియని గందరగోళం. క్షణ క్షణం భయంతో గడపాల్సి వస్తున్నది.
ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధాన్ని మొదలుపెట్టిన ట్రంప్.. చాలా దేశాలను పెట్రోల్ సంక్షోభంలోకి నెట్టారు. ఇండియాలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కష్టాలకు కారణమయ్యారు. దీంతో గల్లీల్లో రోజువారీగా హోటళ్లలో పనిచేసే కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకమైంది. గ్యాస్, పెట్రోల్ కొరతతో హోటళ్లు మూతపడ్డాయి. ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు చేతిలో పని లేకుండాపోయింది. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయాయి. వంటింట్లో సిలిండర్ డెలివరీలు తగ్గిపోయి కట్టెల పొయ్యే దిక్కయింది. పొట్టచేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసులను ట్రంప్ నిర్ణయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు శాంతి దూతగా తనను మించినవారు లేరని, ‘నోబెల్ పీస్ ప్రైజ్’కు తానే ఏకైక అర్హుడినని చెప్పుకుంటూనే వెనెజువెలాపై సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడిని నిర్బంధించారు. తాజాగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్నారు. మెక్సికోతో ఘర్షణలకు కారకులయ్యారు.
‘మేక్ అమెరికా.. గ్రేట్ అగెయిన్’ అంటున్న ట్రంప్ (Donald Trump).. సొంత దేశాన్ని కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడిగా రికార్డును మూటగట్టుకున్నారు. ఇతర దేశాలతోపాటు అమెరికాలోనూ డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక నగరాల్లో బహిరంగంగానే ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు ర్యాలీలు చేస్తున్నారు. ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఒకసారి ‘శాంతి దూత’నంటాడు.. ఇంకోసారి ‘యుద్ధమే శరణ్య’మంటాడు.. మరోసారి ‘అంతా తూచ్’ అంటాడు.. ‘కోతికి కొబ్బరి చిప్ప దొరికితే..’ అన్న చందంగా తయారైంది అమెరికా అధ్యక్షుడి తీరు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. ఆయన నిర్ణయాలు మొత్తం ప్రపంచానికే తలనొప్పిగా మారాయి. ట్రంప్ తలతిక్క నిర్ణయాలపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ ఎడిషన్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Read Also: ఎన్టీఆర్ టు కవిత.. నేతలందరిదీ అదే మాట..
Follow Us On : WhatsApp

