కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad) ప్రాంతం రానున్న రోజుల్లో పారిశ్రామిక పట్టణంగా అభివృద్ధి చెందనుంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ పథకం కింద జహీరాబాద్ స్మార్ట్ సిటీ నిర్మాణ పనులను వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో టౌన్ షిప్
జహీరాబాద్ (Zaheerabad) జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (NIMZ) ప్రాంతంలో పరిశ్రమలకు సంబంధించిన బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా ఇండస్ట్రియల్ టౌన్‌గా ఏర్పాటు చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని 3245 ఎకరాల్లో సుమారు 2360 కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో టౌన్ షిప్ నిర్మాణం చేయబోతున్నారు. అత్యాధునిక సిటీ నెట్ వర్క్, నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా, విశాలమైన రోడ్లు నిర్మించనున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అన్ని అత్యున్నత ప్రమాణాలతో, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సదుపాయలు కల్పిస్తారు. ఈ ప్రతిష్టాత్మక ఇండస్ట్రియల్ సార్మ్ సిటీని ఝరసంగం – న్యాల్ కల్ మండలాల పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. టౌన్ షిప్ నిర్మాణం కోసం అవసరమైన 3245 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని సుమారు 2360 కోట్ల నిధులతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ట్రస్ట్ కలిసి సంయుక్తంగా పారిశ్రామిక అభివృద్ధి పనులు చేయనున్నారు. ఇందులో సింహభాగం మౌలిక వసతుల కల్పన కోసమే రోడ్లు, కరెంటు, గ్రీన్ జోన్ల గురించే జహీరాబాద్‌లో 1695 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.
లక్షలాది మందికి ఉపాధే లక్ష్యం
నిమ్జ్ గా పిలవబడే నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జహీరాబాద్ ప్రాంత రూపరేఖలను పూర్తిగా మర్చబోతుంది. లక్షలాది మందికి ఉపాధే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న నిమ్జ్ కోసం స్థానిక రైతుల నుండి వేలాది ఎకరాల భూములను సేకరించారు. న్యాల్ కల్ మండలంలోని 17 గ్రామాలు, ఝరసంగం మండల పరిధిలోని మూడు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న నిమ్జ్ ప్రాజెక్టు కోసం దాదాపు 12 వేల ఎకరాలకు పైన భూములను సేకరించారు. నిమ్జ్ ప్రాంతంలో ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్, ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నారు. రూ.15,000 కోట్లకు పైగా పెట్టుబడులు లక్ష్యంగా ఈ నిమ్జ్ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. జహీరాబాద్ ప్రాంతంలో వచ్చే భారీ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షలకుపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మొదటి విడతలో భాగంగా ఈ మొత్తం ప్రాజెక్టులో కీలకమైన పారిశ్రామిక అవసరాల కోసం మౌలిక వసతుల కల్పన, స్మార్ట్ సిటీ నిర్మాణం ప్రసుత్తం జరగబోతుంది. క్షేత్రస్థాయిలో రోడ్డు నిర్మాణాలు, కరెంటు స్తంభాలు వేయడం వంటి పనులు మొదలుపెట్టారు. నిమ్జ్ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం భూ కేటాయింపులు సైతం చేసింది. రానున్న రోజుల్లో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధిని సాధించబోతున్నది.
Read Also: రాష్ట్రాన్ని రెండుగా పంచుకున్న కేటీఆర్, హరీశ్‌రావు
Follow Us On : WhatsApp

