కలం, కరీంనగర్ బ్యూరో : అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) అధికారులను ఆదేశించారు. కొత్తగా పింఛన్లకు అర్హత పొందే వారిని శాచురేషన్ మోడ్‌లో గుర్తించి, వారం రోజుల్లో అర్హులందరినీ గుర్తించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి గ్రామము ప్రతి వార్డు వైజ్ గా ఈ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో డి ఆర్డిఓ, జిల్లా సంక్షేమ శాఖ, మెప్మా, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ చిత్రా మిశ్రా చేయూత పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. గ్రామం, వార్డు వారీగా ముందుగా అర్హులను గుర్తించి, వారితో దరఖాస్తులు చేయించే విధానం.. చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన పేదలందరికీ అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నందున ప్రతి గ్రామం, ప్రతి వార్డు నుంచి అర్హులు దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా చైతన్యం కల్పించాలని ఆదేశించారు.
ఇంటింటి సర్వేతో అర్హుల గుర్తింపు
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఇతర సిబ్బంది సహకారంతో విస్తృతంగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఇతర పింఛన్లకు అర్హులైన వారిని గుర్తించి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి .
ఒంటరి మహిళలు తమ జనన ధ్రువపత్రం, ఎస్సెస్సీ మెమో, ఓటరు గుర్తింపు కార్డు (EPIC) వంటి అందుబాటులో ఉన్న పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు అవగాహన కల్పించాలనీ, అవసరమైన సందర్భాల్లో స్థానిక విచారణ, సంబంధిత ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయించాలని సూచించారు. వితంతు మహిళలు తమ భర్త మరణ ధ్రువపత్రాన్ని అందుబాటులో ఉంచుకోవాలని, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ సిద్ధంగా ఉంచుకుని చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు.
కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రక్రియను మరింత సవాలుగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. కరీంనగర్‌లో కార్పొరేటర్లు, ఇతర మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో మున్సిపల్ అధికారులు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో అంగన్వాడి కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం తీసుకుని అర్హుల గుర్తింపు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.
సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలి
2025–26 వానకాలం, రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా రైస్ మిల్లర్లను ఆదేశించారు. సీఎంఆర్‌ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, సంబంధిత గోదాముల్లో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి నర్సింగరావు, జిల్లా మేనేజర్ రజనీకాంత్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సీఎంఆర్ డెలివరీ ఎఫ్ సిఐ గోదాంలు ఖాళీ చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. రబీ సీజన్‌కు సంబంధించి మిల్లులకు కేటాయించిన ధాన్యం, ఇప్పటివరకు పూర్తయిన సీఎంఆర్ డెలివరీ, మిగిలిన పరిమాణం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తికాని చోట సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని, త్వరగా ముగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎఫ్‌సీఐ గోదాములకు సీఎంఆర్ బియ్యాన్ని తరలించే ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రైల్వే వ్యాగన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే రైస్ బ్యాగులను తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదాముల్లో సీఎంఆర్ బియ్యాన్ని భద్రపరిచే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు రైస్ మిల్లర్లు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

