కలం, వెబ్ డెస్క్ : 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పెట్టెలు మార్చడం వలన ఓడిపోయమో.. అర్థరాత్రి ఓట్ల వలన ఓడిపోయామో తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్తే స్వయంగా బయటపెట్టారని బొత్స అనడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. అయితే ఇటీవల ఢిల్లీలో విలేకర్ల సమావేశం నిర్వహించిన నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా అర్థరాత్రి వరకు పోలింగ్ జరగటం వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. సుమారుగా 3500 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని.. రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి ఉదయం 2 గంటల మధ్య 4.16 ఓట్లు నమోదు అయ్యాయన్నారు. ఇది అనేక అనుమానలకు దారి తీస్తుందని వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. అయినప్పటికీ వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

