కలం, వెబ్ డెస్క్: ఏపీలో పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించకపోతే, జులై ఒకటో తేదీ నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తానే స్వయంగా ఆందోళనల్లో పాల్గొంటానని హెచ్చరించారు. ఈ మేరకు తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో తనను కలిసిన ఆక్వా రైతులతో మాట్లాడారు. ఫీడ్ ధరలు, కరెంటు బిల్లుల సబ్సిడీ ఎగవేత, ఎగుమతుల సమస్యలతో సహా అనేక ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఆక్వా రైతులు దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 10 వేలకుపైగా ఆర్బీకేలు, 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు, ఫిషరీస్ అసిస్టెంట్లను పెట్టాం. అప్సడా చట్టాన్ని తెచ్చి, సీఎంనే ఛైర్మన్‌గా నియమించాం. ఫిషరీస్ యూనివర్శిటీ ద్వారా ఆక్వా సాగు నిపుణులను తయారు చేసేలా ఏర్పాటు చేశాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అవన్నీ రద్దు చేశారు’ అని మండిపడ్డారు.
సిండికేట్‌గా మారి రేట్లు తగ్గింపు..
ప్రస్తుతం ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ చంద్రబాబు సానుభూతిపరులవేనని, సిండికేట్‌గా మారి రేట్లు పెంచేశారని జగన్ ఆరోపించారు. ఫిబ్రవరిలో ఫీడ్ రేట్లు కిలో రూ.4 ఉంటే, జూన్‌లో రూ.10, రూ.12 పెంచారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే.. మూడు సార్లు ఉపసంహరించుకునేలా చేశామని గుర్తు చేశారు. అందుకే 2018-19లో 38 లక్షల టన్నులుగా ఉన్న రొయ్య ,మత్స్య ఉత్పత్తులు 2022-23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగినట్లు వివరించారు. అంతేగాకుండా రెండు సార్లు బెస్ట్ మెరైన్ అవార్డులు వచ్చాయన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆక్వా రైతులకు.. రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశామని, 57 నెలల్లో రూ.3,306 కోట్లు విద్యుత్తు సబ్సిడీ కింద చెల్లించామన్నారు. ఆక్వా రైతులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, రైతులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

