కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు ఏడు నుంచి ఎనిమిది కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందు ఉంచినట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి అదనపు ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా సముద్ర తీర రక్షణ చట్టం అమలు, గోదావరి నది కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఏపీకి రానున్న నాలుగు రాయల్ బెంగాల్ టైగర్స్
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో జీవ వైవిధ్యం పెంచేందుకు, పర్యాటకాన్ని పెంపొందించడానికి ఇతర రాష్ట్రాల నుండి పులులను తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పులుల జనాభా ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి ఆరు పులులను కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఏపీకి నాలుగు పులులను ఇచ్చేందుకు అంగీకరిస్తూ అనుమతులు మంజూరు చేశారు. అలాగే మధ్యప్రదేశ్ నుండి మరో రెండు పులులను తీసుకురావడానికి అక్కడి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.
గ్రీన్ సొసైటీ బలోపేతానికి కేంద్రం మద్దతు
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఏపీ గ్రీనింగ్ సొసైటీ బలోపేతానికి కేంద్ర సహాయాన్ని డిప్యూటీ సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యావరణ హిత పథకాలకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా పూర్తి మద్దతు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు కేంద్ర నైపుణ్యాల విభాగం నుండి పెద్ద ఎత్తున సహకారం అవసరమని ప్రస్తావించారు. దీనికి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఎంతో ఉదారంగా స్పందిస్తూ, పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంతోషం వ్యక్తం చేశారు.

