ఫ్యూచర్ సిటీలో స్టేట్ భవన్‌లు.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరానికి ఫ్యూచర్ సిటీని (Future City) ఓ ప్రత్యేకమైన అడ్రస్‌గా, గుర్తింపుగా నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక రకాల ఆలోచనలు చేస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్, డేటా సెంటర్ హబ్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్.. ఇలా అనేక కేటగిరీలుగా విభజించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ‘స్టేట్ భవన్‌’లను నిర్మించుకునేలా ప్రత్యేక జోన్‌ను క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీ నగరానికి మాత్రమే పరిమితమైన ఈ మోడల్ ఫస్ట్ టైమ్ తెలంగాణ ఫ్యూచర్ సిటీలోనూ ఆవిష్కృతం కానున్నది. ఫ్యూచర్ సిటీలో ఇందుకోసమే సుమారు 20 ఎకరాలను ప్రత్యేకంగా కేటాయించాలనుకుంటున్నారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు సైతం సంప్రదింపులు జరిపాయని వివరించారు. మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఒకే భవన్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిందని, కానీ వేర్వేరుగా నిర్మించాలని సూచించినట్లు ఆ ఆఫీసర్ పేర్కొన్నారు.

దీర్ఘకాలిక ఆలోచనతో..!

ఫ్యూచర్ సిటీలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ‘స్టేట్ భవన్’లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించడం పరిపాలనా, ఆర్థిక, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇది అమలైతే.. ఢిల్లీ తర్వాత ‘స్టేట్ భవన్’ల ఏర్పాటు చేసిన నగరంగా ‘ఫ్యూచర్ సిటీ’ నిలుస్తుంది. ఈ నిర్ణయాన్ని కేవలం భూ కేటాయింపుగా కాకుండా, భవిష్యత్ తెలంగాణ ఆర్థిక, దౌత్య, సాంస్కృతిక వ్యూహంలో భాగమనేది అధికారుల అభిప్రాయం.

దేశరాజధాని కావడంతో ఢిల్లీలో దాదాపు ప్రతీ రాష్ట్రానికి ‘స్టేట్ భవన్‌’ ఉంది. ఢిల్లీ వెళ్లే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బస చేయడం మాత్రమే కాక పెట్టుబడి సమావేశాలు, రాష్ట్ర దినోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార సమావేశాలకు అవి వేదికగా ఉంటున్నాయి. కేవలం అతిథి గృహాలుగానే కాకుండా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ‘మినీ ఎంబసీ’ల తరహాలో పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఢిల్లీ నమూనాను ఫ్యూచర్ సిటీలో తీసుకురావాలనుకోవడం వెనుక తెలంగాణ ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆలోచన ఉన్నదని అధికారులు అంటున్నారు.

పెట్టుబడులు, సాంస్కృతిక సమ్మేళనం

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా కాకుండా ఏఐ సిటీ, నాలెడ్జ్ హబ్, గ్లోబల్ బిజినెస్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ రాష్ట్రాల భవన్‌లు ఏర్పడితే ఆయా రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంఘాలు, పెట్టుబడిదారులతో తెలంగాణకు నేరుగా అనుసంధానం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక రాష్ట్రానికి చెందిన పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్నా, తెలంగాణ సంస్థలు ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలన్నా ఆ భవన్‌లు సమన్వయ కేంద్రాలుగా పనిచేసేలా మారుతాయి. దీనికి తోడు ప్రతీ రాష్ట్రం వాటి సొంత సంస్కృతి, కళలు, వంటకాలు, హస్తకళలను ప్రదర్శించే కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ ‘స్టేట్ భవన్‌’లు వేదికలుగా అవతరిస్తాయి. తమిళనాడు ‘పుదు వర్ష పరుప్పు’, కేరళం ‘ఓనం’, అసోం ‘బిహు’, గుజరాత్ ‘నవరాత్రి’, ఒడిశా ‘కళోత్సవం’, పంజాబ్ దినోత్సవం.. లాంటి కార్యక్రమాలు హైదరాబాద్‌లోనే జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఆయా రాష్ట్రాల సంస్కృతులను దగ్గరగా చూసే అవకాశం లభించడంతో పాటు తెలంగాణ సంస్కృతిని కూడా ఇతర రాష్ట్రాలకు పరిచయం చేసే వేదికగా భవన్లు మారే చాన్స్ ఉంది.

‘నెక్స్ట్ గ్రోత్ ఇంజిన్’ స్ట్రాటజీ..!

  • పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతున్నది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్‌లు, రంగాలవారీగా పెట్టుబడి సదస్సులు నిర్వహించడం ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సాధారణమైంది.
  • ఫ్యూచర్ సిటీలో అన్ని రాష్ట్రాల ‘స్టేట్ భవన్‌’లు ఏర్పడితే.. వివిధ రాష్ట్రాల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్ సంస్థలు, పెట్టుబడిదారులు ఒకే ప్రాంగణంలో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. దీంతో హైదరాబాద్ ‘ఇంటర్-స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్’గా ఎదుగుతుందని ఆర్థిక నిపుణులు భావన. ఫలితంగా రాష్ట్రానికి అనేక రకాల ప్రయోజనాలతో పాటు ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమవుతుంది.
  •  ‘స్టేట్ భవన్’ల ఏర్పాటుతో ఫ్యూచర్ సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ఇతర రాష్ట్రాల అధికారులు, వ్యాపారవేత్తలు, ప్రతినిధుల రాకపోకలతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, రవాణా, సేవారంగాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంతర్రాష్ట్ర సమావేశాలు, ప్రభుత్వ స్థాయి చర్చలు, వ్యాపార ఒప్పందాలు, సాంస్కృతిక ఉత్సవాలకు హైదరాబాద్ శాశ్వత వేదికగా మారే చాన్స్ ఉంది.
  •  ఫ్యూచర్ సిటీని తెలంగాణకు ‘నెక్స్ట్ గ్రోత్ ఇంజిన్’గా అభివర్ణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. స్టేట్ భవన్‌ల ఆలోచన ఆ వ్యూహంలో భాగమనే అభిప్రాయం నెలకొన్నది.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>