టేబుల్ టెన్నిస్‌లో భారత్ జోరు.. ప్రీక్వార్టర్స్‌లో మెజారిటీ!

కలం, స్పోర్ట్స్ :  కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో(Table Tennis Championship) భారత ప్యాడ్లర్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషులు, మహిళల సింగిల్స్ విభాగాల్లో భారత ఆటగాళ్లు వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో రౌండ్ ఆఫ్ 32 నుంచి బరిలోకి దిగిన 14 మంది భారత ఆటగాళ్లలో 11 మంది ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. నిష్క్రమించిన ముగ్గురు కూడా భారత ఆటగాళ్ల చేతిలోనే ఓడిపోయారు.టాప్ సీడ్ మనుష్ షాకు తొలి గేమ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, తర్వాత అద్భుతంగా పుంజుకుని విజయం సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన చులోంగ్ నీపై 8-11, 11-9, 11-7, 11-7, 11-4తో గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు.

మరో భారత స్టార్ హర్మీత్ దేశాయ్ కూడా తొలి గేమ్ కోల్పోయాడు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి ఆస్ట్రేలియాకు చెందిన షూకీ లిన్‌పై ఆధిపత్యం చాటాడు. మనవ్ ఠక్కర్ మాల్దీవులకు చెందిన అఖ్యార్ అహ్మద్ ఖలీద్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించాడు. సనీల్ శెట్టి, జాస్ మోదీ, పయాస్ జైన్, ఆకాశ్ పాల్ కూడా విజయాలతో చివరి 16 మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు. భారత ఆటగాళ్ల మధ్య జరిగిన పోటీల్లో హెచ్. జెహాబ్, అంకుర్ భట్టాచార్జీ, ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్, రోనిత్ భంజా సత్తా చాటారు. రోనిత్ భంజా సింగపూర్ ఆటగాడు ఎల్స్‌వర్త్ లేపై ఉత్కంఠ పోరులో విజయం సాధించాడు.

మహిళల విభాగంలోనూ భారత ఆధిపత్యం

మహిళల సింగిల్స్‌లోనూ భారత క్రీడాకారిణులు మెరుగైన ప్రదర్శన చేశారు. కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత శ్రీజా ఆకులకు మాత్రం గట్టి పోటీ ఎదురైంది. ఆస్ట్రేలియాకు చెందిన జియామువా వూ ఆమెను ఏడు గేమ్‌ల వరకు నిలువరించింది. చివరి గేమ్‌లో 11-2తో విజయం సాధించిన శ్రీజా ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. స్వస్తికా ఘోష్, అనూష కుతుంబలే, సిండ్రెలా దాస్, తనీషా కోటేచా, నిత్యశ్రీ మణి, సాయలి వాని, సుతీర్థ ముఖర్జీ, దివ్యాంశి భౌమిక్, యశస్విని ఘోర్పడే కూడా విజయాలతో తదుపరి దశకు అర్హత సాధించారు.అయితే కొన్ని మ్యాచ్‌ల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. కావ్య భట్, సుహానా సైనీ, యశిని శివశంకర్, సయానికా మజీ ఓటమి పాలయ్యారు. మొత్తంగా కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు బలమైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్నారు. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో మరిన్ని విజయాలు సాధించి పతకాలపై గురిపెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>