కలం, కరీంనగర్ బ్యూరో: ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని హామీలిచ్చినా అది కలగానే మిగిలిపోతోంది. ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని 51 ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో దాదాపు 15 వేలమంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేయాలని మే నెలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు ఈ దిశగా చర్యలు లేవు.
ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఇలా..
జగిత్యాల జిల్లాలో 16 కళాశాలల్లో సుమారు 5,700 మంది విద్యార్థులు, కరీంనగర్ జిల్లాలో 11 కళాశాలల్లో 3,827 విద్యార్థులు, పెద్దపల్లి జిల్లాలో 14 కళాశాలల్లో 2,379, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 కళాశాలల్లో సుమారు 2,240 మంది విద్యార్థులున్నారు.
ఉమ్మడి జిల్లాలోని 2,400 పైగా ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని ప్రాంతాల్లో నిధుల విడుదల ఆలస్యం కావడం , మార్కెట్లో కోడిగుడ్ల ధరలు పెరగడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు గుడ్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం అన్నం, పప్పు మాత్రమే వడ్డిస్తున్నట్లు క్షేత్రస్థాయి నివేదికల ద్వారా తెలుస్తోంది.
పేద కుటుంబాలకు చెందిన వారే..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివేవారిలో అనేక మంది పేద కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. ఉదయం అల్పాహారం లేకుండానే విద్యార్థులు కళాశాలలకు ఉదయం 9 గంటలకు వస్తున్నారు. సాయంత్రం వరకు తరగతులు వింటున్నారు. మధ్యాహ్నం కోసం కొందరు లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఉదయం వండిన వంట ఒంటి గంటకు తినాలంటే అంతగా రుచిగా లేకపోవడంతో చాలా మంది తినకుండానే పస్తులుంటున్నామని పలువురు చెబుతున్నారు.
ప్రకటనలకే పరిమితం..
విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తయినా మధ్యాహ్న భోజనం హామీ అమలుకు సంబంధించిన ఆదేశాలు వెలువడకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 51 ప్రభుత్వ కళాశాలలున్నాయి. అందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో సుమారు 15 వేల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా ఖాళీ కడుపుతో గంటల తరబడి తరగతుల్లో కూర్చోవడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గుతోందని అధ్యాపకులు చెబుతున్నారు.
మధ్యాహ్నం తర్వాత అలసట, నీరసం కారణంగా పాఠాలపై దృష్టి సారించలేకపోతున్నారు. కొందరు విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత కళాశాల నుంచి వెళ్లిపోతుండగా, మరికొందరు అసలు కళాశాలకు రావడానికే వెనుకాడుతున్నారు. దీని ప్రభావం హాజరు శాతంతో పాటు ఫలితాలపై కూడా పడుతోందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పథకం అమలుపై అనుమానాలు..
ప్రభుత్వం పలుమార్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు మార్గదర్శకాలు జారీ చేయలేదు. నిధుల కేటాయింపుపై స్పష్టత లేకపోవడంతో పథకం అమలవుతుందా.. లేదా.. అనే సందేహాలు నెలకొన్నాయి.
ప్రభుత్వం హరే రామ ట్రస్ట్ ద్వారా ఉమ్మడి జిల్లాకు సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డితో పాటు కొన్ని జిల్లాల్లో ఈ ట్రస్ట్ భోజనాన్ని అందిస్తున్నారు.
మార్గదర్శకాలు రాలేదు: ఆంజనేయ రావు, ఇంటర్ విద్యాధికారి
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం విషయంలో ఇంకా మార్గదర్శకాలు రాలేదు. పైలట్ ప్రాజెక్టుల్లో చేసిన మాదిరిగా చేస్తారా..? లేక కేంద్రాల వారీగా సెంట్రలైజ్డ్ చేస్తారా..? అనే విషయమై ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. జిల్లా, నియోజకవర్గాల కేంద్రాల వారీగా అమలు చేసే ఆలోచనలోనూ ఉంది. త్వరలోనే ఈ పథకం అమలు జరుగుతుందని సంకేతాలు వచ్చాయి.
వెంటనే అమలు చేయాలి: మంతెన సిద్దార్థ్, గోదూర్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన వసతి, అల్పాహార వసతి కల్పించాలి. సుదూర గ్రామాల నుంచి వచ్చి కళాశాలలో చదువుకుంటున్నాం. ఉదయం 8 గంటలకే బయలుదేరి సాయంత్రం పొద్దుపోయే వరకు ఆకలిగా ఉంటుంది. అల్పాహార, మద్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ కళాశాలలపై విశ్వాసం పెరిగి బాగా చదువుకుంటాం.
మాట నిలబెట్టుకోవాలి: గజ్జెల శ్రీకాంత్, ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, అల్పాహారం సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చింది. రెండు నెలలు గడుస్తున్నా ఇంకా అమలు కాలేదు. ప్రభుత్వ కళాశాలల్లో పేద మధ్య తరగతి కుటుంబాల వారే ఎక్కువగా చదువుకుంటున్నారు. తక్షణమే మధ్యాహ్న భోజనం. అల్పాహారం సౌకర్యం కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.

