కలం, ఖమ్మం బ్యూరో : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం (Bhadrachalam) వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో ఏ క్షణంలోనైనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అంకిత్ వెల్లడించారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి సుమారు 14.6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి భద్రాచలంలోని విస్తా కాంప్లెక్స్ స్లూయిస్, గోదావరి కరకట్ట, స్నానఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భద్రాచలంలో ఇప్పటికే 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే 17 మంది గర్భిణులను సురక్షితంగా ఆస్పత్రులకు తరలించామని పేర్కొన్నారు.
మరోవైపు వరద ముప్పు ఉన్న పరివాహక ప్రాంతాల్లో పోలీసు భద్రతను ఎస్పీ రోహిత్ రాజు తీవ్రతరం చేశారు. తూర్పాక–దుమ్ముగూడెం రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశామని, సారపాక–రెడ్డిపాలెం మార్గంలోనూ ముందస్తుగా బ్యారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెల్ఫీలు, వీడియోల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లేవారిపై, నిబంధనలు ఉల్లంఘించి నదిలోకి దిగే మత్స్యకారులు, పర్యాటకులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విపత్తు నిర్వహణ కోసం SDRF, DDRF బృందాలతో పాటు ప్రతి పోలీసు వాహనంలో లైఫ్ జాకెట్లు, బోయ్లను సిద్ధంగా ఉంచామని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సహకరించి సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

