కలం డెస్క్ : మాజీ మంత్రి దామోదర్ రెడ్డి(Ramreddy Damodar Reddy) మరణంపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్ దామన్న’గా దామోదర్ రెడ్డి సుపరిచితులు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
14 సెప్టెంబర్ 1952న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన కీలక, ప్రత్యేక పాత్ర పోషించారు. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దామోదర్ రెడ్డి.. అరంగేట్రంతో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కమ్యూనిస్టులు, టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో తుంగతుర్తిలో దామన్న, ఆయన సతీమణి వరూధినీదేవిని వెంటబెట్టుకుని పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
కమ్యూనిస్ట్ యోధులగా పేరొందిన భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి దామోదర్ రెడ్డి.. నాలుగు సార్లు విజయం సాధించారు. కమ్యూనిస్ట్ కంచుకోటలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మంలో సదస్సులు పెట్టి ‘టైగర్ దామన్న’గా గుర్తింపు పొందారు.

