కలం డెస్క్ : Local body elections | గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. ఇటీవల నిర్వహించిన రెండు సర్వేలలో విజయావకాశాలు రావడంతో వెంటనే ఎన్నికలకు వెళ్ళడమే ఉత్తమమనే నిర్ణయం తీసుకున్నది. జిల్లాలవారీగా క్షేత్రస్థాయిలో వేర్వేరు అంశాలతో ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత సానుకూల స్పందన రావడం ఆ పార్టీకి ధీమాను పెంచింది. జిల్లాల ఇన్ చార్జి మంత్రులు సైతం స్థానిక ఎన్నికలకు వెళ్ళాలనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రితో ఇటీవల జరిగిన సమావేశంలో వెల్లడించారు.
లోకల్ కేడర్ కు పదవులు :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకల్ కేడర్ కు సంస్థాగతంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరిగింది. అదే సమయంలో ప్రభుత్వం తరఫున కూడా పదవులు దక్కలేదు. మార్కెట్, సహకార సంఘాల్లో పదవులు మినహా మండల స్థాయిలో పదవుల భర్తీ కాకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొన్నది. ఇప్పుడు స్థానిక ఎన్నికలను నిర్వహిస్తే వార్డు సభ్యుల మొదలు సర్పంచ్, ఎంపీటీఎస్, జెడ్పీటీఎస్ లాంటి పదవులు దక్కుతాయని, స్థానికంగా అభివృద్ధి పనులు జరుగుతాయన్నది పీసీసీ భావన.
మీనాక్షి జూమ్ మీటింగ్ :
జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ఇటీవల జూమ్ మీటింగ్ నిర్వహించి స్థానిక ఎన్నికలపై సన్నద్ధం చేశారు. ప్రభుత్వం ఈ రెండేండ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలను ఎక్కడికక్కడ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని, అభివృద్ధి పనుల విషయంలోనూ ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెల్చుకోవడం ద్వారా పార్టీ యాక్టివిటీస్ కూడా ముమ్మరమవుతాయని పేర్కొన్నారు. సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయాన్ని సైతం వారితో పంచుకుని సిన్సియర్ గా పనిచేసి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
ఇన్ చార్జి మంత్రులకు బాధ్యతలు :
స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుంటున్నా కేడర్ తో సమన్వయానికి జిల్లా ఇన్ చార్జి మంత్రులకు అటు ప్రభుత్వం, ఇటు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పజెప్పింది. గ్రామ స్థాయిలో ప్రజలు ఆశించిన పనులు జరగడంలేదని ఇంతకాలం ఉన్న అసంతృప్తికి తోడు చొరవ తీసుకోడానికి పార్టీ, ప్రభుత్వం తరఫున తమకు బాధ్యతలు లేవన్న కార్యకర్తల అభిప్రాయాలపైనా చర్చ జరిగింది. దీంతో ఎమ్మెల్యేలకు, లోకల్ కేడర్ కు మధ్య ఉన్న గ్యాప్ ను తొలగించి స్థానిక ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను చేపట్టాల్సిందిగా ఇన్ చార్జి మంత్రులకు ఆదేశాలు వెళ్ళాయి.
సర్వే అంచనాలతో నిర్ణయం :
గతంతో పోలిస్తే స్థానికంగా పార్టీ పట్ల ఇప్పుడు ప్రజల్లో సానుకూల స్పందనే ఉన్నదని, ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరపడం ద్వారా పార్టీకి, కేడర్ కు మేలు జరుగుతుందన్నది పీసీసీ అభిప్రాయం. సహజంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో సర్వేలు జరగడం ఆనవాయితీ అయినప్పటికీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో స్వతంత్రంగా రాష్ట్రస్థాయి సంస్థలతో సర్వే జరిగింది. రెండు దఫాలుగా జరిగిన అధ్యయనంలో అటు పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్నచోట్లా, పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తేలింది. ఈ కారణంగానే వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ నేతల సమాచారం.

