ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా ఉండటానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) ఆరోపణలు చేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగానే ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇది ముమ్మాటికీ కూటమి ప్రభుత్వ కుట్రేనన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పేదల కోసమే మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వాటిని ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన చేష్టల ద్వారా కూటమి.. పేదలకు అన్యాయం చేస్తోందని అన్నారు. ‘‘వైసీపీ(YCP) పాలనలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశాం. ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో పేదవారికి మెరుగైన వైద్యం అనేది అందని ద్రాక్షలా మారింది. అందుకే ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చాం. నర్సీపట్నం(Narsipatnam)లో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టాం. కోవిడ్ సంక్షోభంలో రూ.500 కోట్ల వ్యవయంతో 600 పడకలతో ఈ మెడికల్ కాలేజీని పూర్తి చేశాం. దీని ద్వారా ఎందరో పేదలకు ఉచిత వైద్యం అందించాం’’ అని ఆయన చెప్పారు.
‘‘వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వాటిలో ఏడు కాలేజీలు పూర్తయ్యాయి. ఆ ఏడింటిలో ఐదు కాలేజీలు ఇప్పటికే క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. 2023-24 విద్యాసంవత్సరం మెడికల్ సీట్లతో అక్కడ బోధన స్టార్ట్ అయింది. విజయనగరం, పాడేరు మెడికల్ కాలేజీల క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. మెడికల్ కాలేజీలు పేదవారికి ఉచిత వైద్యంతో పాటు మెడిసిన్ చదవడానికి అవకాశం కల్పించే దేవాలయాలు’’ అని జగన్(YS Jagan) వ్యాఖ్యానించారు.
Read Also: అదే జరిగితే రాజకీయాలు వదిలేస్తా: పవన్

