కలం, కరీంనగర్ బ్యూరో: హైదరాబాద్‌లోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక తీవ్రమైన పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్‌ను చట్టం నుండి రక్షించడానికి, ఆయన తండ్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన రాజకీయ అధికార బలంతో వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ (Youth Congress) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఒక సమగ్రమైన లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్భంగా వి. శ్యాంసుందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించినప్పటికీ, లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఎంపీ బండి సంజయ్ కుమార్ తన అధికార బలంతో నిందితుడిని దాదాపు 24 గంటల పాటు పోలీసులకు దొరకకుండా దాచిపెట్టారని ఆరోపించారు. ఈ సమయంలోనే డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేసే కుట్రలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరింత ఘోరమైన విషయం ఏంటంటే, బండి సంజయ్ ఐటీ వింగ్, ఆయన అనుచరులు సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) వేదికగా 17 ఏళ్ల మైనర్ బాధితురాలి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, గుర్తింపును లీక్ చేస్తూ ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా, ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి కోర్టు రూమ్‌లో అడిగిన ఒక సాధారణ ప్రశ్నను సామాజిక మాధ్యమాల్లో తప్పుగా వక్రీకరిస్తూ, న్యాయవ్యవస్థను బ్లేమ్ చేసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని డిజిటల్ సాక్ష్యాలను పోలీసులకు సమర్పించారు. ఈ అక్రమాలకు పాల్పడిన బండి సంజయ్ కుమార్, ఆయన ఐటీ వింగ్ అనుచరులపై భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసులో నిజా నిజాలు బయటకు తెస్తున్నందుకు తమకు ఎంపీ వర్గం నుండి ప్రాణహాని ఉందని, తనకు, బాధితురాలి కుటుంబానికి తగిన పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు.
ఈ ఫిర్యాదు సమర్పణలో శ్యాంసుందర్ రెడ్డికి మద్దతుగా సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రహమాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆశీష్ రెడ్డి, కరీంనగర్ సిటీ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుర్ర రాహుల్ గౌడ్, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు, నిందితులకు, వారిని వెనకేసుకొస్తున్న రాజకీయ శక్తులకు శిక్ష పడే వరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

