కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) నుండి భువనగిరికి వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువులు మాట్లాడుతూ.. వలిగొండ భువనగిరి రహదారిపై పలుచోట్ల ఏర్పడిన భారీ గుంతలతో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి గుండా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు ప్రయాణించినప్పటికీ గుంతలను పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బంధారపు లింగస్వామి, రాచకొండ కృష్ణ, బచ్చు శ్రీనివాస్, గంగాధర్ దయాకర్, మైసొల్ల మత్స్యగిరి,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

