కలం, వెబ్‌డెస్క్: అండర్–19 ఆసియా కప్ (Under19 Asia Cup) తుదిపోరులో యువ భారత్ బోల్తా కొట్టింది. ఆదివారం దుబాయ్ వేదికగా దాయాది దేశంతో జరిగిన మ్యాచ్ (India Vs Pakistan)లో ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్ సమీర్ మన్హాస్(172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌కు ఉస్మాన్‌ఖాన్(35)తో కలసి 137 పరుగులు, నాలుగో వికెట్‌కు అహ్మద్ హుస్సేన్(56)తో కలసి 62 పరుగులు జోడించి అవుటయ్యాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు తీయగా, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు, కనిష్క్ చౌహాన్ 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదన ప్రారంభించిన భారత్‌కు తొలి ఓవర్లో వైభవ్ సూర్యవంశీ (26; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) రెండు సిక్స్‌లు, 1 ఫోర్ బాది అదిరే ఆరంభం ఇచ్చాడు. అయితే, మూడో ఓవర్లో కెప్టెన్ ఆయుష్ మాత్రె(2) అవుట్ కావడంతో భారత్ వికెట్ల పతనం ప్రారంభమైంది. వచ్చినవాళ్లు వచ్చినట్లే వెనుదిరిగారు. దీపేశ్ దేవేంద్రన్ (36;16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. ఆరోన్ జార్జ్(16), అభిజ్ఙాన్ కుందు(13), ఖిలాన్ పటేల్(19) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. చివరికి యువ భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బౌలర్లలో అలీ రజా 3, సయ్యామ్, అబ్దుల్ సుభాన్, ఆషాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఆయుష్, వైభవ్ అవుటైనప్పుడు పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో కాసేపు మైదానంలో ఉద్రిక్తత కనిపించింది. సమీర్ మిన్హాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. కాగా, ఇప్పటివరకు 12 సార్లు టోర్నీ (Under19 Asia Cup) జరగ్గా భారత్ 7సార్లు, బంగ్లాదేశ్, పాకిస్థాన్ రెండుసార్లు, ఆఫ్ఘనిస్థాన్ ఒకసారి కప్ గెలిచాయి.
Read Also: ‘మహాలక్ష్మి’ వల్లే ఆర్టీసీ లాభాల్లోకి.. డిప్యూటీ సీఎం
Follow Us On: Instagram


